గురుకులాల్లో విద్యార్థుల మరణ మృదంగం మోగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నది. 11 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగిస్తున్నది. కొందరు విషతుల్యమైన ఆహారానికి బలైతే.. మరికొందరు బలవన్మరణానికి పాల్పడ్డరు. కేవలం 11 నెలల్లోనే ఇంత మంది విద్యార్థులు మృత్యువాత పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా?
– హరీశ్‌రావు
వాంకిడిలో గురుకులంలో పాఠాలు వినాల్సిన విద్యార్థిని 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నది. దీనికి కారణమెవరు? ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనుకున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బలవన్మరణానికి కారణమెవరు? సంగారెడ్డి బీసీ గురుకులంలో ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్యకు కారణమెవరు? గురుకులాల్లో 11 నెలల్లో సగటున నెలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నరు.. ఇందుకు కారణమెవరు? – హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ‘ముఖ్యమంత్రి గారూ.. ఇంకెంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాలె.. ఇంకెప్పుడు మీ కార్యాచరణ మొదలుపెట్టి విద్యార్థులను కాపాడుతరు?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు.విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి, వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, నిర్లక్ష్యం వీడి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆదివారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల వివరాలను కూడా జత చేశారు. ‘గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవంనాడు సీఎం ప్రగల్భాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యాచరణకు దికులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని, ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడటం శోచనీయమని వాపోయారు.
ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
విద్యార్థుల చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని హరీశ్ డిమాండ్ చేశారు. ప్రతిష్ఠాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలోనూ ఇదే దుస్థితి కొనసాగడం దురదృష్టకరమని వాపోయారు. ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.
నరకకూపాలుగా మారినయ్
‘బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మాడల్‌గా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకూ దిగజారిపోతుండటం బాధాకరం. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారినయ్. విద్యాశాఖతోపాటు సంక్షేమం, గిరిజన, మైనార్టీ శాఖల నిర్వహణలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అభంశుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహించే శాఖల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మిగతా శాఖల పనితీరు గురించి చెప్పాల్సిన పనిలేదు’ అని హరీశ్ నిప్పులు చెరిగారు.
మద్దతు ధరకే దిక్కు లేదు.. భరోసా ఎక్కడిది?
రాష్ట్రంలోని కౌలు రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటలకు మద్దతు ధర కూడా దక్కడం లేదని దుయ్యబట్టారు. ‘కౌలు రైతులకు రైతు భరోసా దేవుడెరుగు. వారు పండించిన పత్తిని మద్దతు ధరకు కూడా ఆమ్ముకోలేని దుస్థితి కౌలు రైతులది’ అని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పత్తి పండించిన కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పత్తి కౌలు రైతులను పట్టించుకోవడం లేదని వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ఆయన ఎక్స్‌లో జత చేశారు.