అబిడ్స్, ఆగస్టు 21: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎగ్జిబిషన్ సొసైటీ యజమాన్య కమిటీ కార్యదర్శి ప్రభాశంకర్ మిశ్రా తెలిపారు. తమ విజ్ఞప్తిని మన్నించి, బాధ్యతల స్వీకరణకు అంగీకరించిన మంత్రి హరీశ్‌రావుకు కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సొసైటీ ప్రతినిధులు మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. సొసైటీని మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు కృషిచేద్దామని మంత్రి హరీశ్‌రావు అభయమిచ్చారని తెలిపారు. సొసైటీకి చెందిన విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు లభించేలా చూసేందుకు మంత్రి హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19 విద్యాసంస్థల్లో, 30 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వివరించారు. పాఠశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 1938లో ఎగ్జిబిషన్ సొసైటీని ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు మిశ్రా వివరించారు.