హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ): ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కందులకు క్వింటాకు రూ.400 చొప్పున బోనస్ ఇవ్వండి.. రాష్ట్రవ్యాప్తంగా అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి’ అంటూ హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ము ఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సుమారు 6 లక్షల ఎకరాల్లో కంది పంట సాగుచేశారని, సుమారు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.
కాంగ్రెస్ పా ర్టీ వరంగల్ రైతు డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో కందులకు మద్దతు ధర చెల్లించడంతోపాటు క్వింటాకు రూ.400 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రూ.7,550 మద్దతు ధర కం టే తక్కువగా బహిరంగ మార్కెట్లో 6,500 నుంచి రూ.6,800 వరకు రైతులు తెగనమ్ముకుంటున్నారని, దీంతో రైతులు క్వింటాకు రూ.800 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరిచి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కంది రైతాంగానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు.