Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తొలిదశ, మలిదశ ఉద్యమాల తర్వాత తెలంగాణ సమాజం మరోసారి తిరగబడింది. న్యాయం కోసం పోలీస్టేషన్ మెట్లు ఎక్కిన వారినే అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా నిరసించింది. అరెస్టు చేసిన నేతలను ఎవ్వరికీ కనిపించకుండా హైదరాబాద్ నగరం బయటకు తరలించే ప్రయత్నాలను ఛేదించింది. దీంతో వేలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతి పరులు ఎక్కడికక్కడే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. పోలీసుల వాహనాలను అడ్డగించే ప్రయత్నం చేశారు. తమ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ.. రహదారులను దిగ్బంధం చేశారు. హరీశ్‌రావు సహా, బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ముఖ్య నేతలను అరెస్టు చేసి, మూడు మార్గాల్లో, మూడు వాహనాల్లో తరలిస్తున్న పోలీసు ప్రయత్నాలను బీఆర్ఎస్ కార్యకర్తలు భగ్నం చేశారు. నేతలను తరలించే వాహనాల జాడ తెలుసుకొని అన్ని వైపులా రోడ్లపై మోహరించారు. రెండున్నర గంటల తర్వాత రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కొత్తపేట, కేశంపేట రహదారుల వైపు తీసుకొస్తున్నారని తెలుసుకొని ఆయా గ్రామాల ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వచ్చారు. బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్న వాహనాలు వెళ్లకుండా రోడ్లపై నిప్పు పెట్టారు. ఆయా రహదారుల పరిధిలో అన్ని చోట్లా నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్రజలు ఈ ప్రయత్నంలో పోలీసు వాహనాల టైర్లలో గాలి తీసేశారు. ప్రణాళిక ప్రకారమే మారుమూల పోలీస్స్టేషన్లకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గత్యంతరం లేక హైదరాబాద్ సిటీకి 150 కిలోమీటర్ల దూరంలో, సైబరాబాద్ పరిధిలోని చివరి పీఎస్‌లు అయిన కేశంపేట, తలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌న్లకు బీఆర్ఎస్ నేతలను తరలించారు.
అక్రమ అరెస్టులకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు, సానుభూతిపరులపై పలుచోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అయినా వెనుకడుగు వేయకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకాలం నాటి స్ఫూర్తిని ప్రదర్శించారు. పోలీసులు ఈడ్చిపడేస్తున్నా, లాఠీలతో కొడుతున్నా, వెనకడుగు వేయకుండా కేశంపేట, తలకొండపల్లి పోలీస్స్టేషన్లకు వేలాదిగా తరలి వచ్చి తమ నాయకత్వానికి మద్దతు తెలిపారు.
బీఆర్ఎస్ శ్రేణులు, పరిసర గ్రామ ప్రజలు వెల్లువలా మద్దతు తెలిపేందుకు వస్తుండటంతో పోలీసులు కంగుతిన్నారు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను తిప్పికొట్టేందుకు ఒక్కసారిగా అదనపు బలగాలతో మోహరించారు. కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు ప్రజలు వేలాదిగా తరలి వస్తుండటంతో అదనపు బలగాలన్నీ అక్కడే మోహరించాయి. అక్కడికి మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం వస్తుండటంతో రాత్రి పదిన్నర వరకూ వేలాది ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టి నిరసన తెలిపారు. అదనపు బలగాలతో వారిని సైతం చెదరగొట్టే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్యే గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆయన కుటుంబసభ్యులకు సైతం బందోస్తు ఏర్పాటు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
తమ అరెస్టు నేపథ్యంలో డీజీపీ జితేందర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు ఫోన్ చేశారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల తరబడి వాహనాల్లో తిప్పుతున్న విషయాన్ని హరీశ్‌రావు చెప్పినప్పటికీ డీజీపీ సరిగా స్పందించలేదని తెలిసింది. కనీసం ప్రజాప్రతినిధులం అనే గౌరవం కూడా లేకుండా పోలీసులు తమ పట్ల వ్యవహరించిన తీరును డీజీపీకి వివరించగా.. ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కేశంపేట పోలీస్‌స్టేషన్ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కొనసాగుతున్నది ప్రజాపాలనా? రాక్షసపాలనా? శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేక్కడి దుర్మార్గం.. ఏం తమాషాలు చేస్తున్నారా?’ అని మండిపడ్డారు. తమను ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? శాసనసభ్యులను అరెస్ట్ చేసే ముందు స్పీకర్ అనుమతి తీసుకున్నారా? అని నిలదీశారు. హరీశ్‌రావు ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేక బిక్కమొహం వేశారు.
పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసు వాహనంలో ఎక్కించి రెండున్నర గంటలపాటు హైదరాబాద్ నగరంలోని రోడ్లపై తిప్పారు. మూత్ర విసర్జనకు కూడా వాహనాన్ని ఆపలేదు. కనీసం మంచిళ్లు సైతం ఇవ్వలేదు. ఎమ్మెల్యేల్లో చాలమంది షుగర్, బీపీ లాంటి రుగ్మతలతో బాధపడుతున్నా కనికరించలేదు. పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. దమనకాండకు దిగడమే ప్రజాపాలనా? అని విమర్శించారు. ప్రశ్నించిన నాయకులను పోలీసులు లాగిపడేస్తూ పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యేలు ఉన్న వాహనాన్ని చివరకు నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాతలకొండ పోలీస్‌స్టేషన్‌కు, హరీశ్‌రావు ఉన్న వాహనాన్ని షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట ఠాణాకు తీసుకెళ్లారు.