ఉత్తమ్‌కు సొంత శాఖపై ఇంకా పట్టు రానట్టుంది.. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారో? మా హయాంలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు 11.5 కిలోమీటర్లు జరిగితే, ఇప్పటి కాంగ్రెస్ సర్కారు 200 మీటర్లు కూడా పూర్తిచేయలేక చేతులెత్తేసింది. ఎస్ఎల్బీసీ పైనే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,900 కోట్లు ఖర్చు పెట్టింది. 10 డీపీఆర్‌లలో ఢిల్లీ నుంచి ఏడు ప్రాజెక్టులకు తుది అనుమతులు తెచ్చింది. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మూడు డీపీఆర్‌లు వాపస్ వచ్చినయ్. ప్లస్ ఏడు మాదైతే.. మైనస్ మూడు కాంగ్రెస్ సర్కార్‌వి!
-హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు సాగకుండా గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి ఆపాలని చూసిన ద్రోహి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఉత్తమాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు సోమవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. సహవాస దోషంతో ఉత్తమ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గాలి సోకినట్టుందని ఎద్దేవా చేశారు. ‘మిస్టర్ ఉత్తమ్.. మీ చేతకానితనాన్ని మాపై రుద్దుతున్నారు. మా హయాంలో ఏడు అనుమతులు తెచ్చాం.. రెండేండ్లలో ఒక అనుమతి అయినా తెచ్చారా? పైగా మూడు డీపీఆర్‌లు వాపస్ వచ్చాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా మౌనం ఎందుకు?’ అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు కోసం నేలపై పడుకొని పనిచేశామని, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా? లేదా? అనేది మంత్రి ఉత్తమ్ సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రెండు టన్నెళ్లు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, రెండు టీఎంసీల కోసం మోటర్లు కూడా పెట్టామని హరీశ్‌రావు గుర్తుచేశారు. రూ.27.5 వేల కోట్లు ఖర్చు చేసి 27 వేల ఎకరాల భూమి సేకరించినట్టు చెప్పారు. కొడంగల్- నారాయణపేట లిఫ్ట్‌కు రెండేండ్ల క్రితం కొబ్బరికాయ కొట్టినా, నేటికీ డీపీఆర్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు చేతగానితనాన్ని తమపై రుద్దవద్దని హెచ్చరించారు. ఉత్తమ్‌కు సొంత శాఖపై ఇంకా పట్టు రానట్టుంది.. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారో? అని చురకలంటించారు. తమ హయాంలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు 11.5 కిలోమీటర్లు జరిగితే, ఇప్పటి కాంగ్రెస్ సర్కారు 200 మీటర్లు కూడా పూర్తిచేయలేక చేతులేత్తేసిందని విమర్శించారు. ఎస్ఎల్బీసీపై ప్రేమ ఉన్నట్టు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,900 కోట్లు ఖర్చు పెట్టిందని గుర్తుచేశారు. తమ హయాంలో 10 డీపీఆర్‌లలో ఢిల్లీ నుంచి ఏడు ప్రాజెక్టులకు తుది అనుమతులు తెచ్చామని గుర్తుచేశారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మూడు డీపీఆర్‌లు వాపస్ వచ్చాయని చెప్పారు. ‘ప్లస్ ఏడు మాదైతే.. మైనస్ మూడు కాంగ్రెస్ సర్కారుది’ అని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు జరుపాలని బీఏసీలో తాము పట్టుబట్టినట్టు హరీశ్‌రావు చెప్పారు. వారం రోజులు జరుపుతామని స్పీకర్ చెప్పారని, వారం తర్వాత మళ్లీ బీఏసీని పిలుస్తామని అన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నదీజలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఏసీలో లేవనెత్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక క్వశ్చన్ అవర్ ఆరు రోజులు మాత్రమే పెట్టారని, రోజూ పెట్టాలని తాము డిమాండ్ చేశామని తెలిపారు. ఖాళీగా ఉన్న 16 హౌస్ కమిటీలు వేయాలని కోరినట్టు తెలిపారు. ఎజెండా పంపే పద్ధతి సరిగా లేదని, 24గంటల ముందే అజెండా ఇవ్వాలని కోరామని చెప్పారు. రాత్రి 11 గంటలకు ఎజెండా ఇచ్చి ఉదయం సమావేశానికి ఎలా సిద్ధం కావాలని అడిగినట్టు పేర్కొన్నారు. 15 అంశాలపై సభలో చర్చించాలని బీఆర్ఎస్ తరఫున పట్టుబట్టినట్టు వెల్లడించారు.