హైదరాబాద్ సిటీ బ్యూరో/ మెదక్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కుత్బుల్లాపూర్/జగద్గిరిగుట్ట : 14 నెలలుగా రియల్ ఎస్టేట్‌లో నష్టాలు రావడం వల్ల అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డిది ప్రభుత్వ హత్యేనని, కాంగ్రెస్ సర్కారు అసమర్థత వల్లే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలో వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే వివేకానందగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు ఆదివారం పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబం ఆవేదన చూస్తుంటే హృదయం ద్రవించి వేస్తున్నదని భావోద్వేగానికి లోనయ్యారు. 39 ఏండ్ల యువ బిల్డర్ పిల్లలు, కుటుంబ సభ్యుల ఆవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
బిల్డర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి దారుణం
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా వెలుగొందిన హైదరాబాద్‌లో 14 నెలల్లోనే ఫ్లాట్లు అమ్ముడుపోక బిల్డర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం దారుణమని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్లాట్లు అమ్ముకోలేని స్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులున్నారని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మారిస్తే.. రేవంత్‌రెడ్డి దాని ఖ్యాతిని దిగజార్చారని విమర్శించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి దీనిపై దృష్టి సారించాలని సూచించారు.
హైడ్రా దుకాణం బంద్ చెయ్యాలె
హైడ్రా పేరుతో రోజుకో ప్రాంతంలో కూల్చివేతలు చేపడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని హరీశ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఫ్ల్లాట్లు కొనేందుకు వెనుకాడుతున్నారని చెప్పారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదన్నారు. హైడ్రా దుకాణాన్ని బంద్ చెయ్యకుంటే నిర్మాణ రంగం మరింత దిగజారే పరస్థితి ఏర్పడుతుందని వాపోయారు. హైడ్రా పేరుతో పర్మిషన్లు ఉన్న బిల్డింగులను కూడా కూల్చేసి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు ఫ్లాట్లను కొనుగోలు చేయకుండా చేశారని విమర్శించారు. మూసీ పేరిట పేదల ఇండ్లను కూల్చడం, ఫార్మా సిటీని రద్దు చేయడం, రాత్రి పది గంటలకే దుకాణాలు బందు చేయాలనే అనాలోచిత నిర్ణయాల వల్ల హైదరాబాద్‌పై పాజిటివిటీ తగ్గిపోయిందన్నారు.
హైడ్రా బూచితో రేవంత్‌రెడ్డి రాష్ట్ర నిర్మాణ రంగంపై వ్యతిరేక పరిస్థితులను సృష్టించారని, రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పాజిటివిటీ లేకుండా చేశారని మండిపడ్డారు. విదేశాల్లో ఉండే వారు, ఉత్తరాది రాష్ర్టాల వారు హైదారాబాద్‌లో ఫ్లాట్లు కొనేందుకు జంకుతున్నారని చెప్పారు. ఇప్పటికే బిల్డర్లు బెంగళూరు, ముంబై, నోయిడా వంటి నగరాలకు తరలిపోతున్నారని గుర్తుచేశారు. భేషజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకుని, ఇప్పటికైనా మేల్కోకపోతే పదేండ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. హైడ్రాను పక్కకు పెట్టి రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.
వేణుగోపాల్‌రెడ్డి కుంటుంబాన్ని ఆదుకోండి
‘వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎల్ఐసీలో ఉన్న రూ.18 లక్షల డబ్బును తెచ్చి అప్పులు కట్టి చనిపోయాడు. అలాంటి నిజాయితీపరుడు ఈరోజు కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలకు బలైపోయాడు. వేణుగోపాల్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వేణుగోపాల్‌రెడ్డి మృతిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. తాను ఉపాధి పొందుతూ ఎంతోమందికి ఉపాధి కల్పించే బిల్డర్ చనిపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం’ అని హరీశ్ మండిపడ్డారు.
ఆత్మహత్యలొద్దు..
‘రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. చావే అన్నింటికీ పరిష్కారం కాదు. రైతన్నలు, నేతన్నలు, ఆటో కార్మికులు, బిల్డర్లు.. ఏ ఒక్కరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మీ కోసం అలుపెరుగని పోరాటం చేస్తుంది. మీ సమస్యలు చెప్పుకోవడానికి తెలంగాణ భవన్‌కు రండి. తెలంగాణ భవన్‌కు జనతా గ్యారేజ్ అనే పేరుంది. మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. వేణుగోపాల్‌రెడ్డి కుటుంబాన్ని నిలబెట్టేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్డర్ల సమస్యలపై మాట్లాడుతాం. ప్రభుత్వం కండ్లు తెరిపిస్తాం’ అని హరీశ్ భరోసా ఇచ్చారు.
బిల్డర్స్ అసోసియేషన్ మద్దతుగా నిలవాలి
బిల్డర్స్ అసోసియేషన్ ముందుకొచ్చి వేణుగోపాల్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని హరీశ్ సూచించారు. తోటి బిల్డర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఐదు రోజులు గడిచినా ఒక్క బిల్డర్ అసోసియేషన్ వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమని వాపోయారు. మరో బిల్డర్‌కు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసోసియేషన్లపై ఉందని గుర్తుచేశారు.
రేవంత్‌పై బాధిత కుటుంబాల ఆగ్రహం
సీఎం రేవంత్‌రెడ్డిపై బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు సీఎం ఉన్నారా? లేరా? అనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోయాక ఆదాయం ఎలా వస్తుందని నిలదీశారు. వేలాది మందికి ఉపాధి కల్పించే రియల్ ఎస్టేట్ రంగం పూర్తి నష్టాల్లో ఉన్నదని ఆవేదనచెందారు.
పథకాలన్నీ అమలు చేసి స్థానిక ఎన్నికలు పెట్టండి: హరీశ్
అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి మాట తప్పారని, ఇప్పుడు ఏమీ ఇవ్వకుండానే ఎన్నికల కోడ్‌తో తప్పించుకుందామని చూస్తున్నాడని, రైతులు, ప్రజలు ఆలోచించాలని, కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మోసపోవద్దని హరీశ్ సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిరైతుకు కేసీఆర్ రైతుబంధు వేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే అన్ని పథకాలను అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌లో రేణుక ఎల్లమ్మ విగ్రహా ప్రతిష్ఠాపనకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి హరీశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైందని, అందుకే గ్రామాల్లో గ్రామ దేవతల ప్రతిష్ఠాపనలు పెరిగాయని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో కల్లు దుకాణాలపై ఆబ్కారీ శాఖ దాడులు జరగలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు దుకాణాలపై దాడులు చేస్తున్నదని, గౌడన్నలను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నదని విమర్శిచారు.
4 పథకాలన్నడు.. పైసలు పడ్డాయా?
‘జనవరి 26న నాలుగు పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిండు. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందరికీ వచ్చిందా?’ అని హరీశ్ ప్రశ్నించారు. మండలానికి ఒక్క గ్రామంలోనే రైతు భరోసా డబ్బులు వేస్తే మరి మిగతా గ్రామాల రైతుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఆఖరికి రియల్ ఎస్టేట్ బిల్డర్లు సైతం ఆత్మహత్య చేసుకుంటున్నారని వాపోయారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతుబంధు ఆపలేదని, కేసీఆర్ అధికారంలోకి రాగానే రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేశారని, రైతు బంధు ఎకరాకు రూ.10 వేలు, కల్యాణలక్ష్మి రూ.లక్ష, 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చారని గుర్తు చేశారు. పండిన పంటను గింజ మిగలకుండా కొన్నాడని, ముదిరాజ్‌లకు ఉచితంగా చేప పిల్లలు, గొల్ల కుర్మలకు గొర్రెలను పంపిణీ చేశారని, గీత కార్మికులకు వైన్స్ షాపుల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు.
వేణుగోపాల్‌రెడ్డి కుటుంబం ఆవేదన చూస్తుంటే హృదయం ద్రవించివేస్తున్నది. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి నిర్మించిన అపార్ట్మెంట్ అమ్ముడు పోక వడ్డీలు పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మైస్థెర్యం కోల్పోయిన వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలచివేసింది. 39 ఏండ్ల యువ బిల్డర్ పిల్లలు, కుటుంబ సభ్యుల రోదనకు ఎవరు బాధ్యత వహిస్తరు? కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు నిత్యం ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాపురించింది.
-హరీశ్‌రావు
రాష్ట్రంలో ఆత్మహత్యలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య పాలన, అసమర్థ విధానాలే కారణం. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారినని చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణ రంగాన్ని చేజేతులా నాశనం చేసిండు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లాట్లు అమ్ముకోలేని దుస్థితిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులున్నరు. కేసీఆర్ పదేండ్లలో హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా మారిస్తే.. రేవంత్‌రెడ్డి దాని ఖ్యాతిని దిగజార్చిండు.
-హరీశ్‌రావు