హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవతో జోర్డాన్ వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అకడే చికుకున్న 12 మంది వలస కార్మికులను రప్పించాలన్న కేసీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ మేరకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న ఆ 12 మంది కార్మికులు.. నేరుగా హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. హరీశ్‌రావు ద్వారా కేసీఆర్‌కు వారంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్‌లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురొన్న తమను ఆదుకొని, స్వదేశానికి రప్పించిన కేసీఆర్‌కు, హరీశ్‌రావుకు వారంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తమను రప్పించేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినా ఎవరూ స్పందించలేదని వాపోయారు. తమను తిరిగి స్వస్థలాలకు తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబ పరిస్థితులు, జోర్డాన్‌లో వారికి ఎదురైన ఇబ్బందుల గురించి హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. జోర్డాన్‌లో అనుభవించిన బాధలను చెప్పుకుంటూ వారంతా హరీశ్‌రావు ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని హరీశ్‌రావు వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణలోనే ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని వారి సొంతూళ్లకు వలస కార్మికులు వెళ్లిపోయారు.
రెండు వారాలుగా సంప్రదింపులు
జోర్డాన్ వలస కార్మికుల సమస్య కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన హరీశ్‌రావును పురమాయించారు. కేసీఆర్ ఆదేశాలతో దాదాపు రెండు వారాల నుంచి కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు హరీశ్‌రావు నిరంతరం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఒకవైపు కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకువెళ్లిన హరీశ్‌రావు.. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకెళ్లేందుకు కంపెనీ ఒప్పుకున్నది. వలస కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కంపెనీకి చెల్లించాల్సిన పెనాల్టీతోపాటు, స్వదేశానికి ఆ 12 మంది రావడానికి అయ్యే విమాన టికెట్ల ఖర్చును స్వయంగా హరీశ్‌రావు భరించారు.
ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న వారిని ప్రత్యేక వాహనాల్లో సొంతూళ్లకు తరలించగా, వారంతా ప్రస్తుతం వారిండ్లకు చేరుకున్నారు. బీఆర్స్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్‌లో చికుకున్న 12 మందిని స్వదేశానికి తిరిగి తీసుకొచ్చినట్టు హరీశ్‌రావు చెప్పారు. వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామని, స్పందించి సాయం అందించాలని కోరామని తెలిపారు. జోర్డాన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి బాధిత కార్మికులు అనేకసార్లు వెళ్లి మొరపెట్టుకున్నారని, అయినా అక్కడ ఎవరూ స్పందించలేదుని వివరించారు. అందుకే ఆ 12 మంది కోసం కంపెనీలో చెల్లించాల్సిన పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి రప్పించామని వెల్లడించారు.