హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘దక్కన్ కంపెనీ డైరెక్టర్‌ను తుపాకితో బెదిరించింది మీ అనుచరుడు రోహిన్రెడ్డా? మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంతా? ఈ అక్రమ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణకు సిద్ధమా?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే, తప్పుడు పనులు చేయలేదన్న చిత్తశుద్ధి ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. చేసిందంతా చేసి, దండుకునేదంతా దండుకొని, వాటాల కోసం కొట్లాడుకుని.. తీరా వివాదం సమసిపోయిందనడం, సీఎంకు మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమో, వ్యక్తుల మధ్య పంచాయితీయో కాదని, ప్రభుత్వానికి సంబంధించినదని స్పష్టంచేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్ కచ్చితంగా దండుపాళ్యం ముఠాయేనని, ఒకటి కాదు వందసార్లు చెబుతానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు కమీషన్లు, పనుల్లో వాటాల పంపకాల్లో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణభవన్‌కు ఆటోలో ప్రయాణించారు. అనంతరం తెలంగాణభవన్‌లో నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ బీజేపీ నేత సిందే దీక్షిత్, ఆయన అనుచరులతోపాటు ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండ, రహ్మత్‌నగర్, యూసూఫ్‌గూడ తదితర డివిజన్లకు చెందిన రజకులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయా సందర్భాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాసమస్యలను పక్కనబెట్టి పంచాయితీల పరిష్కారం కోసమే క్యాబినెట్ మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉన్నది మాట్లాడితే కొందరు మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.
సంక్షేమానికి కత్తెరలు
రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో ఒక్క భవనం కట్టలేదని, ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ అమలుచేసిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా సంక్షేమ పథకాలకు .. రేవంత్‌రెడ్డి కటింగ్ మాస్టర్ అవతారమెత్తి కత్తెరపెటారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, భవనాలకు రిబ్బన్ కట్ చేసేందుకు జేబులో కత్తెరపెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏదీచేసినా సగం.. సగం.. ఆగమాగమని, రుణమాఫీ, రైతుబంధు పథకాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అన్నదాతకు యూరియా బస్తాలు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. రేవంత్ సర్కారుపై రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అదను కోసం ఎదురుచూస్తున్నారని స్పష్టంచేశారు.
ఆటోనగర్ ఊసేలేదు..సంక్షేమబోర్డు పత్తాలేదు
రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మహాలక్ష్మి పథకం తెచ్చి ఆటోడ్రైవర్ల పొట్టగొట్టారని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీఇచ్చిన ఆటోనగర్ ఊసేలేదని, సంక్షేమబోర్డు పత్తాలేదని ఎద్దేవా చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ ఆటో ఎక్కి, చిక్కడపల్లి లైబ్రరీకివచ్చి అటు డ్రైవర్లు, ఇటు నిరుద్యోగులకు అలవిగానీ హామీలిచ్చారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మబలికారు. యూసుఫ్‌గూడలో ఆటోఎక్కి డ్రైవర్లకు అరచేతిలో వైకుంఠం చూపారు. సినిమా యాక్టర్లను మించి యాక్టింగ్ చేశారు. ఆచరణలో మాత్రం చేసింది శూన్యం’ అని విమర్శించారు.
పది లక్షల పరిహారమివ్వాలి
కేసీఆర్ పాలనలో ఏ రందీ లేకుండా బతికిన ఆటోడ్రైవర్లు కాంగ్రెస్ పాలనలో అరిగోసపడు తున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. నాడు ప్రతిరోజూ రూ.2000 సంపాదించిన వారు ఇప్పుడు కనీసం వెయ్యి కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన రూ.3,000 కోట్ల నుంచి ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కనీసం రూ.1,500 కోట్లు ఖర్చుచేయాలని డిమాండ్ చేశారు. వెంటనే బాకీపడ్డ రూ.24 వేలను ప్రతి ఆటోడ్రైవర్‌కు ఇవ్వాలని, మరణించిన 161 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. ఆటోడ్రైవర్లు మనోధైర్యాన్ని కోల్పోయి భార్యాపిల్లలను రోడ్డునపడేయవద్దని విజ్ఞప్తిచేశారు. మరో మూడేండ్లలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, వారిని ఆదుకొనే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. వారి తరుఫున అసెంబ్లీలో, బయట పోరాటం చేస్తామని, అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పారు.
కారుకు ఓటేసి, కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని హరీశ్‌రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణభవన్‌లో రజక సంఘాల సమాఖ్య సమన్వయకర్త కాంభోజ వెంకటేశ్వర్లు, రజక సంఘం జాతీయ అధ్యక్షుడు అనిల్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుల సంఘం నాయకులు హరీశ్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ పాలనలో బూతులు తిట్టడం తప్ప చేసిందేమీలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణలోని అన్నివర్గాలకు మేలు జరిగిందని ఉద్ఘాటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల కరెంట్, పింఛన్ల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా అనేక స్కీంలు తెచ్చి ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని కొనియాడారు. కేసీఆర్ హైదరాబాద్‌లోని పేదలకు ఇండ్ల పట్టాలు ఇస్తే రేవంత్‌రెడ్డి కూల్చుతున్నరని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రజకులపై కరెంట్ బిల్లుల భారం
కేసీఆర్ హయాంలో లాండ్రీలకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి రజకులకు బతుకుదెరువు చూపారని హరీశ్‌రావు చెప్పారు. కానీ, కాంగ్రెస్ సర్కారు ఫ్రీ కరెంట్‌ను బంద్ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. బోరబండలోని రజకబిడ్డ బాలమణి ఇస్త్రీపెట్టే దుకాణానికి రూ.31 వేల కరెంట్ బిల్లు పంపిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇలాంటి మోసపూరిత సర్కారుకు జూబ్లీహిల్స్‌లో బుద్ధిచెప్పాలని ఓటర్లకు సూచించారు. కారుకు ఓటేసి కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
దక్కన్ కంపెనీ డైరెక్టర్‌ను ముఖ్యమంత్రి అనుచరులు, మంత్రి అనుచరులు తుపాకితో బెదిరించిన వ్యవహారంపై సీబీఐ విచారణకు ముందుకురావాలి. లేదంటే జ్యుడీషియల్ ఎైంక్వెరీకి సిద్ధంకావాలి. -హరీశ్‌రావు
రోడ్డురోలర్, చపాతి మేకర్‌ను తెచ్చి బీఆర్ఎస్ ఓటర్లను తప్పుదోవపట్టించే కుట్రలకు రేవంత్ సర్కారు తెరలేపింది. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. కారు గుర్తు బ్యాలెట్ పేపర్లో పైనుంచి మూడో నంబర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -హరీశ్‌రావు
కాంగ్రెస్ పాలనలో ధరలు పెంచుడు.. కమీషన్లు దంచుడు తప్ప చేసిందేమీ లేదు. మద్యం నుంచి మొదలుకొని బస్సుచార్జీలు, విత్తనాల రేట్లను ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజల నడ్డివిరిచారు. -హరీశ్‌రావు