SAHAS | హైదరాబాద్ : దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ అగ్రభాగంలో ఉన్నందున రాష్ట్రంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య అత్యధికంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. వర్క్ ప్లేస్‌లో మహిళా ఉద్యోగినుల భద్రతపై రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ సాహస్ (SAHAS) కార్యక్రమాన్ని హోంమంత్రి మహమూద్ అలీ.. డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ శిఖా గోయల్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. వర్క్ ప్లేసెస్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులను ఈ సాహస్తో అరికట్టొచ్చు.
ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ, పరిశ్రమల భాగస్వామ్యంతో చేపట్టే వినూత్న కార్యక్రమాల్లో దేశంలోనే యువ రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా సాహస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు రాష్ట్ర పోలీసులు కృషి చేస్తున్నారని, అదే సమయంలో సంబంధిత సమస్యలన్నింటినీ మానవీయ కోణంలో సంప్రదించేందుకు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో అత్యధిక మహిళా పోలీస్ అధికారులున్న రాష్ట్రంగా తెలంగాణ రూపొందిందని అన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కనీసం ఏడెనిమిది మంది మహిళా పోలీస్ అధికారులున్నారని, వారు అత్యంత సమర్దవంతంగా విధుల్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు. సాహస్ కార్యక్రమం ప్రారంభించడం రాష్ట్ర మహిళా భద్రతా విభాగంలో మరో మైలురాయి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 సంవత్సరానికి ముందు తెలంగాణలోని పది జిల్లాల్లో 9 జిల్లాలు కరువు జిల్లాలుగా ప్రకటించేవారని, 2023 నాటికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఉన్న ధనిక రాష్ట్రంగా మారిందని వెల్లడించారు. దీనికి కారణం రాష్ట్రంలో పకడ్బందీగా ఉన్న శాంతి భద్రతల పరిస్థితులే అని తెలిపారు.
అడిషనల్ డీజీ శిఖా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రారంభించిన మహిళా భద్రతా విభాగం వల్ల రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో భద్రతా భావం నెలకొందని పేర్కొన్నారు. ప్రధానంగా షీ-టీమ్‌లు, భరోసా కేంద్రాలు, ఫ్యామిలి కౌన్సిలింగ్ కేంద్రాల వల్ల రాష్ట్రంలో మహిళలపై వయెలెన్స్ గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. వర్క్ ప్లేసెస్‌లో ఏ మాత్రం వేధింపులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని శిఖా గోయల్ పేర్కొన్నారు.
అనేక భారతీయ భాషల్లో “ధైర్యం” అని అర్థం వచ్చే సాహస్, కార్యాలయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొనే మహిళలకు మద్దతు ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమమని ఆమె వివరించారు. సాహస్ మైక్రోసైట్, సాహస్ సాతి, చాట్ బోట్, సాహస్ వాట్సాప్ నంబర్, ఫోరమ్, ఆన్లైన్ సపోర్ట్ సౌకర్యాలు ప్రారంభించామని వివరించారు. పారిశ్రామిక సంస్థలు, రాష్ట్ర పోలీసు శాఖ మధ్య సమన్వయంతో దేశంలోనే మొట్టమొదటి సారిగా సాహస్ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఐజి రమేష్ రెడ్డి, 2020 మిస్ ఇండియా మానస, సీఐఐ చైర్మన్ సి శేఖర్ రెడ్డి, కార్తికేయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఎండీ భగవతి బల్ద్వా, పూర్ణిమా కాంబ్లే, డా. దీపా నాయర్, లలిత అకుండి, వి రాజశేఖర్ రెడ్డి, అనిల్ అగర్వాల్, రామకృష్ణ లింగిరెడ్డి, రషీదా, భరణి కుమార్ అరోల్, మురళీధరన్ తదితరులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. డీసీపీ పద్మజ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాహస్ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు వెబ్‌సైట్‌కి లాగిన్ చేయవచ్చు: https://womensafetywing.telangana.gov.in/sahasOr, Whatsapp 7331194540 లేదా sahasmitru.wsw@gmail.comకు ఇమెయిల్ పంపండి.