హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు సంబంధించి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన చైర్మన్ల పదవీకాలం పొడిగించాలంటే కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. పార్టీ మారని బీఆర్ఎస్ నేతలకు ప్యాక్స్ చైర్మన్‌గా పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడంలేదని తెలిసింది. రాష్ట్రంలో 904 ప్యాక్స్ ఉన్నాయి. ఈ కమిటీల పదవీకాలం ఆర్నెళ్ల క్రితమే ముగిసింది. గడువు ముగిసిన ప్యాక్స్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం.. ఆయా కమిటీల పదవీకాలాన్ని ఆర్నెళ్లు పొడిగిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసింది. ఆ గడువు కూడా ఆగస్టుతో ముగిసింది. దీంతో మరోసారి ప్యాక్స్‌తోపాటు డీసీసీబీ, టీజీ క్యాబ్ కమిటీల గడువును మరో ఆర్నెళ్లు పొడగిస్తూ ఆగస్టు 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్యాక్స్‌తోపాటు డీసీసీబీల కమిటీలు, చైర్మన్ల పదవీ కాలాన్ని పొడిగించాలి.
కాంగ్రెస్ నేతలు చైర్మన్లుగా ఉన్న ప్యాక్స్‌కు పదవీకాలం గడువు పొడిగింపు ఉత్తర్వులు ఇస్తున్న జిల్లా డీసీవోలు.. బీఆర్ఎస్ నేతలు చైర్మన్లుగా ఉన్న ప్యాక్స్‌కు మాత్రం నిరాకరిస్తున్నట్టు తెలిసింది. దీనిపై సదరు ప్యాక్స్ చైర్మన్లు డీసీవోలను ప్రశ్నించగా.. ‘మా చేతుల్లో ఏమీలేదు.. ఎమ్మెల్యేను, మంత్రిని కలవండి. వాళ్లు ఒక్కమాట చెప్తే వెంటనే ఆర్డర్ ఇస్తాం’ అని చెప్తున్నట్టు తెలిసింది. ఈ విధంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి రాయబారాలు పంపిస్తున్నారని, పార్టీలో చేరితే వెంటనే పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు ఇస్తారని లేనిపక్షంలో పెండింగ్‌లో ఉంటుందని చెప్తున్నట్టు తెలిసింది. ఈ విధంగా కాంగ్రెస్‌లో చేరేందుకు 300 మంది నిరాకరించినట్టు సమాచారం. దీంతో వీరు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్యాక్స్ కమిటీలకు పదవీకాలం గడువు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడంలేదని తెలిసింది. ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక కాంగ్రెస్‌లో చేరిన వారికి పొడిగింపు ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ప్యాక్స్ కమిటీలకు పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ బెదిరింపు, ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపిన సర్కారు.. దశల వారీగా ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.