హైదరాఆద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అటవీ ప్రాంతాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులపై అటవీశాఖ అధికారుల వేధింపులను అరికట్టాలని పాలమూరు కురుమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం అధికారుల తీరును నిరసిస్తూ పాలమూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ అటవీశాఖ ప్రధాన కార్యాలయం(అరణ్యభవన్) ఎదుట ఆందోళన చేపట్టారు.
అనంతరం అటవీ సంరక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలమూరు జిల్లా పరిధిలో అటవీ సంరక్షణ పేరుతో అధికారులు పశువులు, గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతంలోకి అనుమతించడం లేదని వాపోయారు. మేతకోసం తీసుకొస్తున్న గొర్రెలు, మేకలు పెంపకందారులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పీసీసీఎఫ్ డోబ్రియల్ మాట్లాడుతూ.. పశువులు, మేకలపై వన్యమృగాలు దాడి చేస్తున్నాయని, పశువులకాపరుల చర్యలతో అడవుల్లో అగ్నిప్రమాదాలు పెరిగాయని, పశుగ్రాసం కోసం చెట్లను నరికి వేస్తున్నారని పేర్కొన్నారు. అటవీ సంరక్షణ చర్యల్లో భాగంగా పశువులు, మేకల పెంపకందారులను అనుమతించడం లేదని వెల్లడించారు. గడ్డి మైదానాల్లో మేపుకోవాలని సూచించారు.