గుర్రంపోడ్, ఫిబ్రవరి 25 : కిస్తీలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి ఒత్తిడి తేవడంతో మనస్తాపానికి గురైన రైతు బ్యాంకర్ల ముందే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం తేనపల్లి తండాలో మంగళవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తేనెపల్లి తండాకు చెందిన రైతు వడిత్య జవహర్లాల్, అనిత దంపతులు. వీరు మండల కేంద్రంలోని కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ఇద్దరి పేరిట నాలుగేళ్ల క్రితం రూ.15 లక్షలు మార్ట్గేజ్ కింద అప్పు తీసుకున్నారు.
ఆరు నెలలకోసారి చెల్లించాల్సిన కిస్తీ కట్టకపోవడంతో మంగళవారం బ్యాంకు డివిజనల్ అధికారితోపాటు బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లు రైతు వడిత్య ఇంటికి వచ్చి రైతును అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో రైతు గడ్డిమందు తాగాడు. గమనించిన బ్యాంకు సిబ్బంది నల్లగొండ దవాఖానకు తరలించారు. బాకీపడిన రుణ విషయంపై ఒత్తిడి చేయలేదని అధికారులు పేర్కొన్నారు.