Harish Rao | నూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన సొంత ఖర్చులతో బ్లాంకెట్స్, టీ షర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆరు నెలల నుంచి కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం అశ్చర్యాన్ని కలిగించిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకు హాస్టల్‌కు వచ్చానన్నారు. మెస్, కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం బాధాకరమన్నారు.
అసెంబ్లీలో చెప్పిన మెను వేరే ఉందని.. హాస్టల్లో మెను వేరే ఉందన్నారు. విద్యార్థులు ధరించే దుస్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని.. మీకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వంలో ఉన్న వారితో మాట్లాడి అమలు అయ్యేలా చేస్తానన్నారు. నూతన సంవత్సరం అంటే విందు వినోదాలు కాకుండా ఉండాలని హాస్టల్ విద్యార్థులకు అవసరమైనవి ఇవ్వాలని చెప్పడంతో కార్యకర్తలు అందరూ ముందుకు రావడం సంతోషమన్నారు. విద్యార్థులు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు, ఆన్లైన్ గేమ్స్ బారినపడకుండా ఉండాలని.. మంచిగా చదువుకోని తల్లితండ్రుల గౌరవం కాపాడాలని పిలుపునిచ్చారు. చెడు వ్యసనాల వైపు వెళ్లడానికి చాలా మంది చూస్తుంటారని.. వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
తెలిసిన వారెవరైనా ఏదైనా మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్టు తెలిస్తే సార్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇటీవల ఆన్ లైన్ గేమ్ ఆడి ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య చేసుకున్నారని.. విద్యార్థులు ఎవరూ ఆన్లైన్ గేమ్స్ బారినపడకూడదన్నారు. మన మాజీ మన్మోహన్ సింగ్, అబ్దుల్ కలాం లాంటి వారంతా వీధిదీపాల కింద చదువుకొని పైకి వచ్చారని.. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. 10వ తరగతి విద్యార్థులు బాగా చదవాలని.. ఉజ్వల భవిష్యత్ పది నుంచే ప్రారంభం అవుతుందన్నారు. ప్రత్యేక తరగతుల్లో సొంత ఖర్చులతో స్నాక్స్ ఏర్పాటు చేపిస్తానన్నారు. 10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్‌గా ఇస్తానన్నారు. డాక్టర్ చదవాలనుకునే విద్యార్థులను తాను చదివిపిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.