Vemulawada | వేములవాడ, మార్చి 11: వేములవాడ రాజన్నకు భారీ మొత్తంలో బాకీపడి, చెక్‌బౌన్స్ కేసులు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ పట్ల ఉన్నతాధికారులు ఉదారంగా వ్యవహరించడం, బాకీ వసూలు కాకముందే రూ.5 కోట్ల విలువైన తలనీలాలు అందజేయడం విమర్శలకు తావిస్తున్నది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే తలనీలాలను పోగు చేసుకునేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన సుమిత్ ఎంటర్ప్రైజెస్ తొమ్మిది నెలలుగా చెల్లింపులు జరపడంలో విఫలమైంది. ఆ సంస్థ ప్రతి నెలా రూ.79.17 లక్షలు చెల్లించాల్సి ఉండగా, 2024 ఏప్రిల్ నుంచి చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ రాజన్న ఆలయానికి రూ.9.54 కోట్లు బాకీ పడ్డారు. ఆలయ అధికారులు గత ఏప్రిల్ నుంచి కాంట్రాక్టర్‌కు తలనీలాలు ఇవ్వడం లేదు.
రాష్ట్ర ఉన్నతాధికారులు సదరు కాంట్రాక్టర్‌కు వెసులుబాటు కల్పిస్తూ బాకీ ఉన్న రూ.9.54 కోట్లలో రూ.2.5 కోట్లు చెల్లిస్తే, డిసెంబర్ నాటికి భద్రపరిచిన తలనీలాలను అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. స్వామివారికి చెల్లించాల్సిన బాకీ రూ.7 కోట్ల వరకు ఉండగా, సదరు కాంట్రాక్టర్ పాత పద్ధతిలోనే పోస్ట్‌డేటెడ్ చెకులు అందజేశారు. మార్చి 28 నాటికి రూ.కోటి, ఏప్రిల్ 10న రూ.కోటి, 11న రూ.కోటిన్నర చెల్లించేవిధంగా మూడున్నర కోట్లకు చెక్కులు ఇచ్చారు. మిగిలిన మూడున్నర కోట్లను కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత (వచ్చే నెల 12తో ముగియనున్నది) అదీ జూన్ నుంచి డిసెంబర్ నాటికి ప్రతినెలా చెల్లించేవిధంగా చెకులు అందజేశారు. గడువు ముగిశాక కూడా సదరు కాంట్రాక్టర్‌కు వెసులుబాటు కల్పించడం వెనుక ఆంతర్యం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 133 సంచుల్లో నిలువ ఉంచిన రూ.5 కోట్ల విలువైన తలనీలాలను మంగళవారం రాజన్న ఆలయ అధికారులు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తలనీలాలు అందజేసినట్టు రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి వినోద్‌రెడ్డి తెలిపారు.