ఎల్కతుర్తి, అక్టోబర్ 14 : తాను కని పెంచిన కొడుకు తనను సాకడం లేదని ఓ తండ్రి ఆవేదనతో 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితుడు, ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఎల్కతుర్తికి చెందిన గోలి శ్యాంసుందర్‌రెడ్డి-వసంత దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరికి పెండ్లిళ్లు అయి స్థిరపడ్డారు. 2021 సంవత్సరంలో శ్యాంసుందర్‌రెడ్డి భార్య వసంత కరోనాతో మృతి చెందింది. అప్పటి నుంచి కొడుకు రంజిత్‌రెడ్డి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో శ్యాంసుందర్‌రెడ్డికి హనుమకొండలో ఉన్న ఇల్లుతోపాటు కొంతభూమిని తండ్రి నుంచి కొడుకు బదలాయించుకొని పట్టించుకోవడం మానేశాడు. దీంతో శ్యాంసుందర్‌రెడ్డి ఎల్కతుర్తిలో ఉన్న ఇంటిలోనే ఒంటరిగా జీవిస్తున్నాడు. అప్పటి నుంచి తన యోగక్షేమాలు కొడుకు పట్టించుకోవడం మానేశాడని శ్యాంసుందర్‌రెడ్డి వాపోయాడు.
ఇటీవల సుప్రీంకోర్టు తల్లిదండ్రులను పట్టించుకోని, హింసించే వారసులకు ఆస్తులను అనుభవించే హక్కులేదనే తీర్పునకు ప్రభావితమై తన దగ్గర ఉన్న 6 ఎకరాల్లో 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని శ్యాంసుందర్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. జిల్లా రెవెన్యూ అధికారులను కలిసి వారి సమక్షంలోనే 3 ఎకరాల భూమిని అప్పగిస్తూ సంతకం చేశాడు. తల్లిదండ్రులను పట్టించుకోని వారసులకు గుణపాఠం కలుగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్యాంసుందర్‌రెడ్డి తెలిపాడు. ఈ భూమిలో ప్రభుత్వం నిరుపేదల కోసం పాఠశాల లేదా కళాశాలను తన భార్య జ్ఞాపకార్థం నెలకొల్పాలని కోరాడు. ఈ విషయంపై తహసీల్దార్ ప్రసాద్‌రావును వివరణ కోరగా, ఆ స్థలంలో సర్వే నిర్వహించి సమగ్ర వివరాలను జిల్లా అధికారులకు నివేదిస్తామని తెలిపారు.