హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేత సమస్యలు పరిష్కారం కోసం నేత కార్మికులు కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని నేత కార్మిక సంఘాల నాయకులు కూరపాటి రమేశ్, వీ శాంతికుమార్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ల ముట్టడించి, ధర్నా తదితర కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దశలవారీగా జరగనున్న పోరాటంలో భాగంగా వచ్చే నెల 25న భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.