హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికులు కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ విధానంపై మండిపడుతున్నారు.
చివరి ప్రయత్నంగా రేవంత్రెడ్డి సర్కారుపై పోరాటానికి దిగుతున్నారు. ఇప్పటికే రెండు, మూడుసార్లు నిరసనలు, ధర్నాలు నిర్వహించగా.. నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి శ్రీకారంచుట్టారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని నేత కార్మిక సంఘం నాయకులు కూరపాటి రమేశ్, శాంతికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.