రాంనగర్ (కరీంనగర్), సెప్టెంబర్ 10 : ఉపాధి లేక.. అప్పుల పాలై చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన గుండేటి గణేశ్ (38) సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఉపాధి లేక కుటుంబ కలహాలతో ఆరు నెలల కిందట భార్య కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లింది.
సుమారు రూ.3 లక్షల వరకు అప్పు కావడంతో తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యాడు. ‘ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నా. నా మృతదేహాన్ని మున్సిపాలిటీ వారికి అప్పగించాలి’ అని సూసైడ్ నోట్ రాసి సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో పురుగుల మందు తాగాడు. తండ్రి మల్లేశం గమనించి వెంటనే చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కరీంనగర్ రూరల్
ఇన్స్పెక్టర్ ప్రదీప్ తెలిపారు.