దుబ్బాక, మే 12: ఉపాధి కరువై.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాకకు చెందిన గొరిట్యాల బాలరాజు(48) కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాడు. ఏడాదిన్నరగా చేనేతకు ఆదరణ లేకపోవడంతో కులవృత్తిని వదిలి కూలికి వెళ్తున్నాడు. వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు.
అతడి భార్య లత ముగ్గురు పిల్లలతో హైదరాబాద్కు వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తుంది. బాలరాజు దుబ్బాకలో తల్లి సరోజన వద్ద ఉంటున్నాడు. కుటుంబ పోషణ కోసం తెలిసిన వారివద్ద సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడు. కులవృత్తి సాగక, చేసిన అప్పులు తీరే మార్గం లేక ఆందోళనతో బాలరాజు ఇంట్లోని దూలానికి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.