హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ) : చేనేతలకు ఇచ్చిన హామీ ల అమలులో విఫలమైన కాంగ్రెస్‌పై పోరుకు చేనేత కార్మికులు సిద్ధమవుతున్నారు. కొత్త పథకాల అమలు సంగతేమోగానీ, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నదని నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చేనేత సహకార సంఘాలు, కార్మికుల సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 24న ‘చలో చౌటుప్పల్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. స్థానిక పద్మవంశీ ఫంక్షన్ హాల్లో ‘చేనేత హకుల సాధన సభ’ నిర్వహించనున్నట్టు చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. చేనేత పథకాలను ప్రభుత్వం ఏడాదిగా నిలిపివేసిందని, చేనేత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. చేనేతలో టెం డర్ విధానాన్ని తీసుకొచ్చిందని, రుణమాఫీకి, త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ పథకాల అమలుకు షరతులు విధించిందని నిప్పులు చెరిగారు.
సంఘాలకు పావలా వడ్డీ నిధులు, 60 ఏండ్లు పైపడ్డవారి బీమా డబ్బు విడుదల చే యడం లేదని ఆరోపించారు. సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ మాఫీపైనా మౌనం వహిస్తున్నదని మండిపడ్డారు. టెసో పాలక మండలి లేకపోవడంతో అధికారులు, ప్రభుత్వం ముందు కనీస మర్యాద దకడం లేదని వాపోయారు. ‘చేనేత జీఎస్టీని రీయింబర్స్మెంట్ చేస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. గత రెండు బడ్జెట్లలో పద్మశాలీ కార్పొరేషన్‌కి కేటాయించిన రూ.100 కోట్లలో పైసా ఖర్చు చేయలేదు. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పద్మశాలీ కార్పొరేషన్‌కు పాలక మండళ్లను నియమించలేదు’ అని పేర్కొన్నారు. ఆయా అంశాలపై సభలో సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు. చేనేత సహకార సంఘా ల ప్రతినిధులు, కార్మికులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.