హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమల పేరిట బలవంతంగా గుంజుకోవాలని చూస్తే, తమ భూములను ఇచ్చేది లేదంటున్న రైతుల పక్షాన అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు సర్కార్‌ను నిలదీశారు. మంగళవారం సెషన్ ప్రారంభం కాగానే, ఇదే అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ‘రాష్ట్రంలో పరిశ్రమల పేరిట సాగు భూముల బలవంతపు సేకరణను వ్యతిరేకిస్తున్న అమాయక రైతుల అక్రమ అరెస్టులు, నిర్బంధం, అరెస్టు చేసిన రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి’ అనే అంశంపై బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాణిక్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విజయుడు, అనిల్‌జాదవ్ ఇచ్చిన వాయి దా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల చట్టబద్ధతపై చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన భూములను సాగుచేసుకుంటున్న రైతులకు రైతుబంధు, పంట రుణాలు, పట్టాలు ఇవ్వాలంటూ సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సైతం స్పీకర్ తిరస్కరించారు. తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానానికి అవకాశం ఇవ్వకపోయినా కనీసం చర్చకు అనుమతించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ ససేమిరా ఒప్పుకోకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు.
విరామం అనంతరం సభ ప్రారంభం కాగానే లగచర్ల రైతులకు సంకెళ్లు వేసిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టబట్టారు. స్పీకర్ నిరాకరించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. జగదీశ్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, కేపీ వివేకానంద పోడియం ఎదుట బైఠాయించారు. బీఆర్ఎస్ ఆందోళనలకు బీజేపీ సభ్యులు కూడా జత కలిశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలైన నిరసన.. 3:50 వరకు కొనసాగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ పలు బిల్లుల ప్రతులను చింపివేసి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఒకదశలో బీఆర్ఎస్ సభ్యులతో పోటీగా కౌంటర్‌గా కాంగ్రెస్ సభ్యులు పోటీ నిరసనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.
బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఆందోళన నిర్వహిస్తుండగానే సభ పలు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ, తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, జీఎస్టీ సవరణ బిల్లులను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టగా.. వాటిపై ఎటువంటి చర్చ లేకుండానే సభ ఆమోదం తెలిపింది. అనంతరం నూతన పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే, రైతులపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. సర్కార్ తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి, బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నిరసన, నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో స్పీకర్ సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
శాసనమండలి సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు. లగచర్ల గిరిజన రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. మంగళవారం ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. నిరసన, నినాదాలతో సమావేశ మందిరం హోరెత్తింది. దీంతో మండలి ప్రాంగణంలో మార్షల్స్‌ను మోహరించారు. పరిస్థితిని గమనించిన చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలిని బుధవారానికి వాయిదా వేశారు. అనంతరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో చైర్మన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. తరువాత మీడియా పాయింట్ వద్దకు చేరుకుని లగచర్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, మహమూద్‌అలీ, సత్యవతిరాథోడ్, ఎల్ రమణ, శంభీపూర్‌రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సురభి వాణీదేవి, తక్కళ్లపల్లి రవీందర్రావు, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వినూత్న నిరసనతో సర్కార్ తీరును ఎండగడుతున్నది. లగచర్ల బాధితులకు మద్దతుగా మంగళవారం ఉభయసభల్లో మెరుపు నిరసనలకు దిగింది. సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు ఉభయ ప్రాంగణాల్లోని పార్టీ ఎల్పీ కార్యాలయాల్లో నల్లదుస్తులు ధరించారు. లగచర్ల రైతులకు కాంగ్రెస్ సర్కార్ వేసిన బేడీలను గుర్తుచేసేలా బీఆర్ఎస్ సభ్యులు బేడీలతో నినాదాలు చేస్తూ సమావేశ మందిరాలకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే డ్రెస్‌తో నిరసన వ్యక్తంచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన నిర్వహిస్తుండగానే ఎలాంటి చర్చ లేకుండా సభ మూడు బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ముందుగా స్పీకర్ అనుమతితో మంత్రి కొండా సురేఖ సీఎం తరఫున యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ బిల్లుకు మద్దతుగా మాట్లాడుతూ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, జీఎస్టీ సవరణ బిల్లును మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు. వీటికి కూడా ఎటువంటి చర్చ లేకుండానే ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విపక్ష సభ్యుల నిరసనలతో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నారు. బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులు పేర్కొన్న అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అసరమైతే జనవరి మొదటివారం వరకు సభకు సిద్ధమేనని, అయితే స్పీకర్‌దే నిర్ణయమని మీడియాతో చిట్‌చాట్‌లో చెప్పారు. సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై రూపొందించుకున్న రూల్ బుక్‌ను విపక్ష సభ్యులు తుంగలో తొక్కారని మంత్రి సీతక్క ఆరోపించారు. నూతన పర్యాటక పాలసీ-2025-2030కి రూపకల్పన చేసినట్టు నూతన పర్యాటక విధానంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఒకవైపు స్వల్పకాలిక చర్చ జరుగుతుండగా, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఆందోళన కొనసాగుతుండగా, స్పీకర్ ప్రసాద్‌కుమార్ సభను బుధవారానికి వాయిదా వేశారు.