మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌లో సోమవారం నిర్వహించిన హమాలీ యూనియన్ 18వ ఆవిర్భావ దినోత్సవ మహాసభలో తన మనుమడికి కేసీఆర్ పేరు పెట్టానని కేటీఆర్‌కు చెప్తూ మురిసిపోతున్న హమాలీ నేత శ్రీనివాస్.
హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సేవలను చిరస్థాయిగా గుర్తుంచుకొనే ఉద్దేశంతో తన మనుమడికి కేసీఆర్ అని పేరు పెట్టినట్టు హమాలీ సంఘం నేత శ్రీనివాస్ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెప్పారు. తన కుమారుడు మహేందర్, కోడలు సుస్మితలకు 2025 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం రోజున బాబు జన్మించాడని తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యతతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ మనుమడికి కేసీఆర్ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు.
సోమవారం హమాలీ ఆశీర్వాద సభ సందర్భంగా కేటీఆర్‌ను కలిసిన శ్రీనివాస్ తన కుటుంబానికి సంబంధించిన విశేషాన్ని ఆయనతో పంచుకున్నారు. తమ కమ్యూనిటీ పేరు ‘కుర్మ’లోని కే, చరణ్‌లోని సీ, రాజ్‌లోని ఆర్ అక్షరాలను కలిపి బాలుడికి ‘కుర్మ చరణ్‌రాజ్ (కేసీఆర్) అని పూర్తి పేరు నమోదు చేసి జనన ధ్రువీకరణ పత్రం కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. బాలుడు మంచి భవిష్యత్తుతో ఎదగాలని కేటీఆర్ ఆశీర్వదించారు. కేటీఆర్ ఆశీర్వదించిన ఈ రోజు తమ కుటుంబానికి ఎప్పటికీ మరపురాని రోజుగా నిలిచిపోతుందని ఆయన భావోద్వేగంతో చెప్పారు.