హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రతిష్టాత్మకమైనదిగా చెప్పుకుంటున్న హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల ప్రాజెక్టును పూర్తిగా బ్యాంకు రుణంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంతోనా లేక ప్రపంచ బ్యాంకు రుణంతోనా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం వెచ్చించాల్సిన 40% నిధులే కాకుండా కాంట్రాక్టర్లు ఖర్చు చేయాల్సిన 60% నిధులను కూడా బ్యాంకుల ద్వారా సేకరించాలని, దీనికి ప్రభుత్వమే గ్యారంటర్‌గా ఉండాలని రేవంత్‌రెడ్డి సర్కారు నిర్ణయించింది. దీన్నిబట్టి ఈ ప్రాజెక్టును పూర్తిగా అప్పుతోనే చేపడతారని స్పష్టమవుతున్నది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం 40%కాంట్రాక్టర్లు 60% నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దశలవారీగా 17 వేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తొలి విడతలో రూ.33,194 కోట్లతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు కలిపి 13,137 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి 4 వరుసల రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికి రాష్ట్ర మంత్రిమండలి ఇదివరకే ఆమోదం తెలిపింది. హ్యామ్ విధానాన్ని ఎక్కువగా జాతీయ రహదారుల నిర్మాణానికే అమలు చేస్తున్నారు.
ఈ విధానంలో కాంట్రాక్టర్ ఖర్చుచేసే 60% నిధులను టోల్‌ట్యాక్స్ ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రోడ్లపై టోల్‌ట్యాక్స్ వసూలు చేయడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ వాటాను కూడా వాయిదాల పద్ధతిలో పూర్తిగా తామే చెల్లించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది.
అంటే, తొలి విడతలో 13,137 కి.మీ. రోడ్ల నిర్మాణానికయ్యే రూ.33,194 కోట్ల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది. రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం అసాధ్యం ప్రస్తుతం మన రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం సాధ్యంకాదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) వాదిస్తున్నది. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా తిరిగి చెల్లించేది ఎలా? అని పలువురు కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.