హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యూటీ మోడ్(హ్యామ్) రోడ్లను జాతీయ రహదారుల(ఎన్హెచ్) నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. పదేండ్లపాటు రోడ్లు చెక్కుచెదరకుండా నాణ్యతా ప్రమాణాలపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.
బుధవారం సచివాలయంలో ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ అధికారులతో రోడ్ల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధానంలో హ్యామ్ రోడ్లు కీలకం కానున్నాయని తెలిపారు. నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్న టిమ్స్ దవాఖానలు, వరంగల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, ఆర్వోబీల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.