హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు (Ham Roads Project) ముందుకు కదలడమే లేదు. ఎంతో అట్టహాసంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వమే తీవ్ర జాప్యం చేస్తున్నది. నిబంధనలను సాకుగా పెట్టి అందరినీ అడ్డుకుంటున్నది. అర్హతల పేరుతో అనుయాయులకే కట్టబెట్టేందుకు సాగతీస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు జాతీయ రహదారులనూ ఇదే విధానంలో చేపట్టాలని నిర్ణయించినా, భూసేకరణ అడ్డంకిగా నిలిచింది. సమీక్షలతోనే సరిపెడుతూ అసలు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టును పట్టాలెక్కించడంలో ప్రభుత్వమే జాప్యం చేస్తున్నది. ఈ పరిణామాల వెనుక ఏదో మతలబు జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో చేపట్టే హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) విధానంలో చేపట్టే రోడ్లకు అదనంగా మరికొన్ని రోడ్లను జోడించి వ్యయాన్ని ఏకంగా రూ.4,000 కోట్లకు పైగా పెంచేశారు. చాలావరకు ఏజెన్సీలను బ్యాంకు రుణాలతో ముడిపెట్టి టెండర్లలో పాల్గొనే అర్హత లేకుండా చేస్తున్నారు.
రాష్ట్రంలో హ్యామ్ విధానంలో ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు.. దాదాపు ఏడాదిపాటు కసరత్తు తర్వాత మొదటి దశలో చేపట్టే రోడ్లను ఎంపికచేసింది. రూ.6,478.33 కోట్లతో 5,190.25 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గత జూలైలోనే ఆమోదం తెలిపింది. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 16 సర్కిళ్లలో జిల్లాలవారీగా 373 పనులకు గత ఆగస్టులోనే టెండర్లు పిలుస్తామని మంత్రి ప్రకటించారు. క్యాబినెట్ ఆమోదం పొందిన దానిలో 350 కి.మీ. మేర రోడ్ల విస్తరణ పనులతోపాటు పలు రోడ్ల మరమ్మతులు, రెన్యూవల్స్, కొత్త రోడ్లు ఉన్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ విధానంపై కాంట్రాక్టర్లు, బ్యాంకర్లతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో.. ప్రస్తుత విధానాన్ని వ్యతిరేకించిన కాంట్రాక్టర్లు పలు సూచనలు చేశారు. దీంతో ప్రతిపాదిత హ్యామ్ రోడ్లకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.
336 కి.మీ. మేర రోడ్లు అదనం
తాజాగా అధికారులు మరికొన్ని రోడ్లను హ్యామ్ ప్రాజక్టులో కలపాలని నిర్ణయించడం పలు సందేహాలకు తావిస్తున్నది. మొదట ఆమోదించిన 5,190 కిలోమీటర్లకు అదనంగా మరో 336 కి.మీ. పెంచగా, పనులు సైతం 350 నుంచి 401కి పెరిగాయి. అంచనా వ్యయం కూడా రూ.6,478 కోట్ల నుంచి ఏకంగా రూ.10,606 కోట్లకు ఎగబాకింది. అంటే, దాదాపు రూ.4,168 కోట్ల మేర అదనపు పనులు చేపట్టాలని తాజాగా నిర్ణయించినట్టు సమాచారం. కొత్తగా జోడించిన పనులు, పెరిగిన వ్యయానికి క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి అని అధికారులే చెప్తున్నారు. కొత్తగా చేర్చిన రోడ్లకు క్యాబినెట్ ఆమోదం తీసుకుంటారా? లేక గతంలో ఇచ్చిన ఆమోదంతోనే ఈ రోడ్లకు కూడా టెండర్లు పిలుస్తారా? అనేది వేచిచూడాలి.
అనుయాయులకే అప్పగించే స్కెచ్?
హ్యామ్ రోడ్ల పనులను కట్టబెట్టేందుకు ఇప్పటికే కాంట్రాక్టు ఏజెన్సీల ఎంపిక కూడా పూర్తయిపోయిందని, తూతూమంత్రంగా టెండర్ల ప్రక్రియ చేపడతారనే ప్రచారం జరుగుతున్నది. అధికార పార్టీ నేతలకు చెందిన కొన్ని ఏజెన్సీలు, కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి, ఎవరు ఏ పని చేపట్టాలో నిర్ణయించుకుంటున్నారని ఆర్అండ్బీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పనులు వారికే లభించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త రోడ్లను చేర్చి, వ్యయాన్ని రూ.4,168 కోట్లు పెంచడం వెనుక అసలు మతలబు ఇదేనని పలువురు ఆరోపిస్తున్నారు. క్యాబినెట్ ఆమోదం లభించిన రోడ్లకు వెంటనే టెండర్లు పిలవకుండా జాప్యంచేయడం, తాజాగా మరికొన్ని రోడ్లను ఇందులో కలపడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. టెండర్లలో గోల్మాల్ జరిగే అవకాశం ఉన్నదని పలువురు కాంట్రాక్టర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మరమ్మతు పనులు, పాత రోడ్ల పునరుద్ధణ పనులు కాకుండా కొత్త రోడ్లు, రోడ్ల విస్తరణ మాత్రమే హ్యామ్ విధానంలో చేపట్టాలని కొన్ని కాంట్రాక్టు ఏజెన్సీలు ఇదివరకే ప్రభుత్వానికి స్పష్టంచేశాయి.
పనులు దక్కకుండా కుట్ర?
హ్యామ్ విధానంలో నిధులను 40% ప్రభుత్వం, మిగిలిన 60% కాంట్రాక్టర్లు బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకుంటాయి. ప్రభుత్వం మొదట మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించడంతోపాటు పనులు చేపట్టిన మొదటి రెండున్నరేండ్లలో తమ వాటా 40% నిధులను చెల్లిస్తుంది. మిగతా 60%లో కాంట్రాక్టర్లు 18% సొంతంగా, 42% బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకోవాలి. కాంట్రాక్టర్లు వెచ్చించిన 60% నిధులను పనులు పూర్తయ్యాక ప్రభుత్వం 0.8% వడ్డీతో నెలనెలా 30 వాయిదాల్లో చెల్లిస్తుంది. పనులు పూర్తయ్యాక 15 సంవత్సరాలపాటు కాంట్రాక్టరే ఆ రోడ్డును నిర్వహించాల్సి ఉండగా, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.
తమ నిబంధనలకు లోబడి మాత్రమే కాంట్రాక్టు ఏజెన్సీలకు రుణాలు మంజూరు చేస్తామని, ఆయా ఏజెన్సీల క్రెడిట్ స్కోర్ రేటింగ్ ఆధారంగానే రుణ సహాయం అందిస్తామని ఇప్పటికే బ్యాంకర్లు ప్రభుత్వానికి స్పష్టంచేశారు. దీనిపై కాంట్రాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. రేటింగ్ పేరుతో తమను టెండర్లలో పాల్గొనకుండా చేసేందుకు కుట్ర జరుగుతున్నదని పలువురు కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. క్యాబినెట్ ఆమోదం తెలిపిన రోడ్లకు వెంటనే టెండర్లను ఆహ్వానించి, తాము తీసుకునే రుణాలకు ప్రభుత్వమే గ్యారెంటర్‌గా ఉండాలని, రేటింగ్‌ల పేరుతో తమను పనులు చేపట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేయరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీల సూచనలను పెడచెవిన పెట్టి అడ్డగోలుగా పనులను పంచి పెట్టేందుకు పక్కా స్కెచ్ రూపొందిస్తున్నట్టు తెలిసింది.
4 హైవేలపై కేంద్ర, రాష్ర్టాల నిర్లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం రహదారులను మంజూరు చేసి చేతులు దులుపుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశాలతో సరిపెడుతున్నది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 4 కీలక జాతీయ రహదారుల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంతోపాటు జగిత్యాల-కరీంనగర్, ఆర్మూర్-జగిత్యాల, జగిత్యాల-మంచిర్యాల రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరంలో పనులు చేపట్టే ప్రాజెక్టుల జాబితాలో వాటికి చోటివ్వలేదు. ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టాల్సి ఉన్నది. దాదాపు 160 కి.మీ.ల ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి రూ.15,627 కోట్లు, 191 కి.మీ.లు ఉండే మిగిలిన 3 రహదారులకు రూ.7,372 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా.
వీటిని హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్ విధానం)లో నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ట్రిపుల్ ఆర్ భూసేకరణ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉండగా.. మిగిలిన 3 రహదారుల భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు దాదాపు రూ.5,500 కోట్లు, మిగతా 3 రహదారుల భూసేకరణకు రూ.100 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు విడుదల చేయాల్సి ఉం డగా, ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసింది. జగిత్యాల-కరీంనగర్, ఆర్మూర్-జగిత్యాల, జగిత్యాల-మంచిర్యాల రహదారుల భూసేకరణకు రూ.100 కోట్లు అవసరమవుతాయని అంచనాలు రూపొందించగా, కేంద్రం రూ.9 కోట్లే మంజూరు చేసింది.
సమీక్షలతోనే సరి
జాతీయ రహదారుల అభివృద్ధి, భూసేకరణపై సీఎం రేవంత్ సమీక్షలు నిర్వహించినా అడుగు ముందుపడని పరిస్థితి. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా నష్టపరిహారాన్ని నిర్ణయించి భూసేకరణకు రైతులను ఒప్పించే నాథుడే కరువయ్యాడు. కేంద్ర ప్రభుత్వం సైతం గతంలో నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధర ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని మొండికేయడంతో భూసేకరణ ప్రక్రియ ముం దుకు సాగడంలేదు. ఈ అంశంపై స్పందించేందుకు అటు ఎన్హెచ్ఏఐ అధికారులు, ఇటు ఆర్అండ్బీ అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ 4 కీలక జాతీయ రహదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కాంట్రాక్టర్లకు చెల్లింపులపై సర్వత్రా సందేహాలు?
ప్రభుత్వం ఇవ్వాల్సిన 40%, కాంట్రాక్టర్లు తీసుకునే రుణాలు కలిపి మొత్తం 100% ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పవచ్చు. కనీసం రోడ్ల మరమ్మతులకే నిధులు ఇవ్వని సర్కారు, ఇంత భారీస్థాయిలో నిధులు ఎలా సమకూరుస్తుందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హ్యామ్ విధానంలో కాంట్రాక్టర్లు వెచ్చించే 60% నిధులను టోల్‌ట్యాక్స్ ద్వారా వసూలు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఆ నిధులను కూడా తామే చెల్లిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తుందనే భరోసా కాంట్రాక్టర్లకు కలగడంలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక చిన్నాచితకా రోడ్ల బిల్లులే దాదాపు రూ.5,000 కోట్ల వరకూ పెండింగులో ఉన్నాయని, దీన్నిబట్టి ప్రభుత్వం హ్యామ్ రోడ్లకు నిధులు ఎలా చెల్లిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు కాంట్రాక్టర్లు బాహాటంగానే అనుమానిస్తున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వ ప్రతిపాదిత హ్యామ్ రోడ్ల ప్రాజక్టు ఏ మేరకు ముందుకు సాగుతుందో వేచిచూడాల్సి ఉన్నది.
హ్యామ్ రోడ్ల మొదటి దశ పనుల వివరాలు మొత్తం
తాజా ప్రతిపాదనలు, అంచనా వివరాలు
కేంద్రం ఈ ఏడాది చేపట్టే పనుల జాబితాలో చేర్చిన రహదారులు