మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల దందా రాష్ట్రంలో మళ్లీ మొదలవుతున్నదా? అడ్వాన్స్‌ల పేరుతో కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ సర్కారు మళ్లీ తెరతీస్తున్నదా? వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో చేసిన మొబిలైజేషన్ దోపిడీని ఇప్పుడు పునరావృతం చేయబోతున్నారా? చేయని పనులకు రూ.వందల కోట్ల అడ్వాన్స్‌లు ఇచ్చి రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపబోతున్నారా? ‘హ్యామ్’ విధానం అంటూ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు రోడ్లను బాగుచేసేందుకా లేక నేతలు జేబులు నింపుకొనేందుకా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆచరణ సాధ్యంకాదని కాంట్రాక్టర్లు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తున్నది. దీంతో హ్యామ్ వెనుక ఏదో మతలబున్నదన్న చర్చ జోరుగా జరుగుతున్నది.
Telangana | హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): రోడ్ల పేరుతో తమ జేబులు నింపుకునేందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామీణ రోడ్లకు హ్యామ్ విధానాన్ని అమలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎంపిక చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగించి, ఆ వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హ్యామ్ ప్రాజక్టు మొదటి దశలో భాగంగా రూ.10,547కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, ఉన్నతీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు వేయాలని భావిస్తున్నారు. కిలోమీటరుకు సగటున రూ.2 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చాలావరకు గ్రామాల నుంచి మండలాలకు కొన్నిచోట్ల బీటీ, మరికొన్నిచోట్ల సీసీ రోడ్లను నిర్మించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రోడ్ల నిర్వహణను గాలికి వదిలేసింది. చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో రోడ్లు అధ్వానంగా మా రాయి. రోడ్లను మెరుగుపర్చాలన్న ప్రజల విన్నపాలను పక్కనబెట్టి, రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. చిన్న కాంట్రాక్టర్లను పూర్తిగా తొలగించి బడా ఏజెన్సీలకు పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాదు, టెండర్లు ఖరారుకాగానే మొ బిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
హ్యామ్ విధానంలో చేపట్టే పనులకు 40శాతం ప్రభుత్వం, మిగిలిన 60శాతం బ్యాంకు రుణాల ద్వారా ఏజెన్సీలు భరిస్తాయి. ఏజెన్సీలు పెట్టిన ఖర్చును 15 ఏండ్లపాటు టోల్ వసూళ్ల ద్వారా సమకూర్చుకుంటాయి. ఇప్పటివరకు జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో చేపట్టే రహదారులకు మాత్రమే హ్యామ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మండల, జిల్లా కేంద్రాల రోడ్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులకు కూడా హ్యామ్ విధానాన్ని చేపడుతుండడం గమనార్హం. ఈ రోడ్లపై టోల్ వసూళ్లకు వీలు లేనందున కాంట్రాక్టర్లు భరించే 60శాతం మొత్తాన్ని కూడా దశలవారీగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆర్అండ్బీ శాఖ మంత్రి ఇటీవల ప్రకటించారు. అయితే.. ప్రభుత్వం గత రెండేండ్లుగా రోడ్ల మరమ్మతులకు ఒక్క పైసా ఇవ్వలేదని కాంట్రాక్టర్లు విమర్శిస్తున్నారు. అనేక నిరసనల అనంతరం ఇటీవలే రూ.100 కోట్లు విడుదల చేశారు. రూ.10వేల కోట్ల హ్యామ్ ప్రాజెక్టులో సుమారు రూ.6వేల కోట్లను కాంట్రాక్టర్లే భరించాల్సి ఉంటుంది. రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకే ప్రభుత్వానికి రెండేండ్లు పడితే.. మరీ రూ.6వేల కోట్లు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చని చెప్తున్నారు.
ప్రభుత్వం రూ.10,547కోట్ల పనులను 32ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంటే, ఒక్కో ప్యాకేజీ కనీసం రూ.300 కోట్లకుపైగా ఉంటుంది. చిన్న కాంట్రాక్టర్లు కేవలం రూ.10కోట్లలోపు పనులు మాత్రమే చేపట్టే సామర్థ్యం కలిగి ఉన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఇంతకాలం రోడ్డు పనుల్లో నిమగ్నమైన చిన్న కాంట్రాక్టర్లను కాదని, బడా ఏజెన్సీలకు పనులన్నీ కట్టబెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లు పూర్తయిన వెంటనే ప్రభుత్వం భరించాల్సిన 40శాతం ఖర్చుతోపాటు కాంట్రాక్టరు ఖర్చు చేయాల్సిన 60శాతంలో కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించేలా ప్రణాళికలు రూపొందించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్హెచ్ఏఐ చేపడుతున్న రోడ్డు పనులకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లిస్తారు. పరికరాలు, సామగ్రి, మానవ వనరులను సమకూర్చుకునేందుకు ప్రాజెక్టు వ్యయంలో పదిశాతం వరకు అడ్వాన్స్ చెల్లించే వీలుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ విధానంలో చేపడతామంటున్న పనుల్లో పెద్దగా మెషినరీని సమకూర్చుకునే అవసరం లేదని రోడ్లు, రహదారుల రంగానికి చెందిన నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే రోడ్డు పనులు చేపట్టేందుకు రాష్ట్రంలో 2వేల మందికిపైగా చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారని, వారి ఆధ్వర్యంలో యథావిధిగా పనులు చేపట్టే వీలుందని పేర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం అడ్వాన్స్ చెల్లించేందుకే మొగ్గు చూపుతున్నదని, పైగా 10శాతం కాకుండా 25శాతం వరకూ ఇచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
సహజంగా హ్యామ్ విధానంలో ఎన్హెచ్ఏఐ కొత్త రోడ్లను, అలాగే డబుల్ లేన్ నుంచి నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాల్సిన రోడ్లను చేపడుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదివరకే వేసిన రోడ్లను ఉన్నతీకరణ పేరుతో చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎంపికచేసిన 32 ప్యాకేజీల్లో సింహభాగం రోడ్లు గత బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటు చేసినవే ఉన్నాయని పలువురు కాంట్రాక్టర్లు చెప్తున్నారు. నిరుడు వేసిన బీటీ రోడ్లపై గుంతలు పడితే రెండేండ్లలో తట్టెడు మన్ను పోసిన నాథుడు లేడని, ఫలితంగా రోడ్లు మరింత ధ్వంసం అయ్యాయని పేర్కొంటున్నారు. కిలోమీటరుకు రూ.కోటి కేటాయిస్తే పాడైన రోడ్లను బాగుచేసుకునే వీలుందని, ప్రభుత్వం మాత్రం అలా చేయకుండా మంచిరోడ్లను, పాడైన రోడ్లను అన్నింటినీ ఒకే గాటన కట్టి హ్యామ్ కింద అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు విమర్శిస్తున్నారు. ఇలా చేస్తే భారీగా ని ధులు గోల్మాల్ అయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హ్యామ్‌లో ఎవరికి పనులు అప్పగించాలనే దానిపై ఇప్పటికే ఉన్నతస్థాయిలో నిర్ణయం జరిగినట్టు ఆర్అండ్బీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని ఎంపిక చేసిన ఏజెన్సీలతో ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్టు సమాచారం. వారు ఎంపికచేసిన ఏజెన్సీలకే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కొత్త ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటే వారికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వకపోవడమే కాకుండా పనుల విషయంలోనూ ఇబ్బంది పెట్టే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు, చిన్న కాంట్రాక్టర్లు గొడవ చేయకుండా ఉండేందుకు వారికి సబ్ కాంట్రాక్టులు కూడా కట్టబెట్టే విధంగా అధికారులు వారితో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మొత్తంమీద హ్యామ్ ప్రాజెక్టును ఓ ‘స్కామ్’గా అభివర్ణిస్తున్నారు.
32 ప్యాకేజీలు మొత్తం రోడ్లు 400
5,566.15 కిలోమీటర్ల పొడవు
10,547 వ్యయం కోట్లల్లో