పెరిగిన సర్కారు వారి వాటా
- ఆరోగ్యశ్రీ క్లెయిమ్‌ల్లో సగం ప్రభుత్వ దవాఖానలవే
- సర్కారు వైద్యంపై పెరిగిన నమ్మకానికి నిదర్శనం
- ఎనిమిదేండ్లలో మెరుగుపడిన వైద్య సదుపాయాలు
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ఉమ్మడిరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిని వివరిస్తూ పాటలు వ్యాప్తిలోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పోతే సర్కారు దవాఖానకే పోవాలనేలా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఆరోగ్య శ్రీ చికిత్సల్లో ప్రభుత్వ దవాఖానల వాటా సుమారు 50 శాతానికి పెరగటమే దీనికి నిదర్శనం.
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడేనాటికి మొత్తం ఆరోగ్యశ్రీలో క్లెయిముల్లో ప్రభుత్వ దవాఖానల వాటా 30 శాతమే ఉండగా.. ఇప్పుడు సగానికి పెరిగింది. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం కావడం, దవాఖానల్లో వసతులు సమకూరడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. క్యాన్సర్ సర్జరీలు, మోకీలు మార్పిడి వంటి శస్త్రచికిత్సలు, క్లిష్టమైన ఆపరేషన్లు సైతం ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహిస్తున్నారు.
దీంతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 87.5 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. తద్వారా దేశంలోనే అత్యధిక కుటుంబాలకు హెల్త్ కవరేజీ ఇస్తున్న రాష్ర్టాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది. తాజాగా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌ను కలిపి అమలుచేస్తున్నది. ఒకప్పుడు రూ. 2 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందగా.. ఇప్పుడు ఆ పరిమితి రూ.5 లక్షలకు పెరిగింది.

ఒకప్పుడు 30 శాతం.. ఇప్పుడు దాదాపు సగం
- 2014-15లో మొత్తం 1.96 లక్షల ఆరోగ్య శ్రీ క్లెయిములు రాగా ఇందులో సుమారు 1.4 లక్షలు ప్రైవేట్/కార్పొరేట్ దవాఖానల నుంచి వచ్చాయి. అంటే సుమారు 70 శాతం. మిగతా 30 మాత్రమే ప్రభుత్వ దవాఖానల నుంచి వచ్చాయి.
- 2021-22లో ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు మొత్తం 3.56 క్లెయిములు వచ్చాయి. ఇందులో సుమారు 1.55 లక్షల క్లెయిములు ప్రభుత్వ దవాఖానల నుంచే వచ్చినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సుమారు 43 శాతం. ఏడేండ్లలోనే గణనీయ వృద్ధి సాధించింది.
- ఆరోగ్య శ్రీ చెల్లింపుల్లోనూ ప్రభుత్వ దవాఖానలకు చేరుతున్న నిధుల వాటా పెరిగింది. 2007లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం అయ్యాయి. నాటి నుంచి 2014 జూన్ 2నాటికి చేసిన చెల్లింపుల్లో రూ.1,510 కోట్లు ప్రభుత్వ దవాఖానలకు చేరాయి. మొత్తం చెల్లింపుల్లో ఇది 23 శాతం. గత ఎనిమిదేండ్లలో ఈ వాటా 32 శాతానికి పెరిగింది. అది మొత్తం రూ.1980 కోట్లు.
- పీహెచ్‌సీలను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 858 పీహెచ్సీ/యూపీహెచ్‌సీలు ఆరోగ్యశ్రీతో అనుసంధానం అయ్యాయి. పేదలకు దూరం వెళ్లకుండానే సేవలు అందుతున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ దవాఖానల క్లెయిముల వాటా 50 శాతానికి చేరొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బలోపేతం చేసిన సీఎం కేసీఆర్
ఆరోగ్యశ్రీ ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభమైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత బలోపేతం చేశారు. గతంలో ఆరోగ్యశ్రీలో అవయవమార్పిడి, క్యాన్సర్ వంటి విలువైన చికిత్సలు అందుబాటులో లేవు. పేదల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. చికిత్సల సంఖ్యను పెంచడంతోపాటు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్సలు వంటి కొన్ని వ్యాధులకు పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. తద్వారా ఆయా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరోగ్యశ్రీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వైద్య సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ.. ఆరోగ్యశ్రీ సేవలు పెంచాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
వసతులు పెరిగాయి.. నమ్మకం పెరిగింది
గతంతో పోల్చితే ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు బాగా పెరిగాయి. క్యాథ్ ల్యాబ్, ఎంఆర్ఐ, సీఆర్ఆర్టీ వంటి అత్యాధునిక పరికరాలు సమకూరాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ దవాఖానల్లో శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేదలకు అవసరమైన మోకీలు మార్పిడి, కాటరాక్ట్, అవయవ మార్పిడి వంటి సర్జరీలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఉస్మానియాలో ఇటీవల ఒకే రోజు 7 మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేశాం. గతంలో ఒకటీ అరా మాత్రమే జరిగేవి. మోకీలు మార్పిడి కోసం జనగామ, ఆలేరు వంటి ప్రాంత్లాలో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయించారు. అవయవమార్పిడిలో ప్రభుత్వ దవాఖానలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా హాస్పిటల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

