ఇబ్రహీంపట్నం, మర్చి 3 : రంజాన్ మాస ఉపవాస దీక్షలు విరమించేందుకు ముస్లిం సోదరులు తీసుకునే పౌష్టికాహారం హలీం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలు సాయంత్రం తమ దీక్షను విరమించే సమయంలో ఆరోగ్యానికి అధిక శక్తితో పాటు రుచికరమైన ఆహారంగా హలీంను ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో మార్కెట్లో హలీం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
నేడు ముస్లిం సోదరుల కంటే కూడా హిందువులే హలీం రుచులకు ఎంతో ఆకర్షితులవుతున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, బొంగ్లూరు, యాచారం, మాల్, మంచాల తదితర ప్రాంతాల్లో హలీం దుకాణాలు భారీ ఎత్తున వెలిశాయి. హలీంకు మంచి గిరాకీ ఉండటంతో ఈ దుకాణాలన్నీ సాయంత్రం అయితే చాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో సుమారు 10 వరకు హలీం దుకాణాలు వెలిశాయి.
ఇరాన్ నుంచి భారతదేశానికి పాకిన హలీం సంస్కృతి..
హలీం మొదట్లో ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఇరాన్ దేశంలో ప్రారంభించారు. ఇది క్రమంగా ఇరాన్ దేశం నుంచి నేడు భారతదేశానికి పాకింది. మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో హలీంకు ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో హైదరాబాద్లో మాత్రమే హలీం లభించేది. కానీ, నేడు మారుమూల గ్రామాలకు సైతం హలీం వ్యాపించి హిందూ, ముస్లింలను తన వద్దకు రప్పించుకుంటుంది. నోరూరించే హలీం పట్ల ఉపవాసాలు చేసే ముస్లింలే కాకుండా యువత ఎంతో మక్కువ చూపుతున్నారు.
మూలికలతో తయారీ..
హలీంలో అన్ని వంటకాల కంటే భిన్నంగా తయారు చేస్తారు. హలీం కోసం దుకాణం ముందు భట్టీలను ఏర్పాటు చేసి అందులో పెద్ద పాత్రను అమరుస్తారు. ఆ పాత్రలో గోధుమలు, మాంసం, నెయ్యితోపాటు వనమూలికల మిశ్రమంతో అయిదారు గంటల పైగా ఉడకబెట్టి గుజ్జులాగా తయారు చేస్తారు. ఇందులో ఎలాంటి మసాలాలు వాడకపోవటం విశేషం. హలీమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసుకున్న హిందువులు రంజాన్ నెల ప్రారంభం కాగానే ప్రతిరోజు సాయంత్రం హలీంను ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. దీంతో హలీంకు ఎంతో మంది అభిమానులు పెరిగిపోయారు.
హలీంను తయారు చేస్తున్న దృశ్యం..