హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల ఫేస్బుక్ స్నేహానికి గుర్తుగా గిఫ్ట్‌లు పంపిస్తున్నానని చెప్పగానే హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన గృహిణి గుడ్డిగా నమ్మేసింది. కస్టమ్స్ క్లియరెన్స్ ఖర్చుల పేరిట రూ.1.2 కోట్లు చెల్లింది. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం.. బాధితురాలికి ఫేస్బుక్లో లియోన్ మ్యాక్రియా అనే పేరుతో ఉన్న ఐడీతో ఒకరు ఫ్రెండ్ అయ్యారు.
కొన్నాళ్లు చాటింగ్ చేస్తూ వచ్చారు. ఇలా ఐదేండ్లు అప్పుడప్పుడు చాట్ చేస్తూ వచ్చారు. ‘ఐదేండ్ల స్నేహానికి గుర్తుగా నీకు ల్యాప్‌టాప్, ఐ ఫోన్స్, ఆభరణాలు, డాలర్లు ఆమెరికా నుంచి పంపిస్తా’ అంటూ లియోన్ నమ్మించింది. రెండు రోజుల వ్యవధిలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారుల పేరుతో ఫోన్ వచ్చింది. ‘మీ పేరుతో చాలా విలువైన వస్తువులు వచ్చాయి. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది’ అని మాట్లాడారు. అత్యాశతో నిజమని నమ్మిన బాధితురాలు.. వివిధ క్లియరెన్స్‌ల కోసం పలు దఫాలుగా రూ.1.2 కోట్లు చెల్లించింది. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన ఆమె సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.