హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఇటీవల జరిగిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో నిందితుల బంధువులను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది హత్య కేసులో ప్రధాన నిందితులైన హసన్ బిన్ అలీ యాఫై, మునీర్ అహమ్మద్ తరఫున సయ్యద్ సాదిక్ వేసిన ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హసన్ బిన్ అలీ తల్లి అక్తర్ ఉన్నీసా బేగం, భార్య సఫీనా ఖాతూన్, సోదరుడు ఒమర్ బిన్ అలీ యాఫై, కుమారుడు ఈసా బిన్ హసన్ యాఫై పోలీసుల నిర్బంధంలో ఉన్నారని పేరొన్నారు. వారిని కోర్టు ముందు హాజరుపరచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను జూన్ 4కు వాయిదా వేసింది.