చారకొండ, జూన్ 20 : నాగర్‌కర్నూల్ జిల్లా సిరుసనగండ్ల సమీపంలోని అయోధ్యనగర్‌లో ఇండ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్ ఫైర్ అయ్యారు. గడువు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా వారిని రోడ్డున పడేస్తరా? అని మండిపడ్డారు. అధికారులు కూల్చిన ఇండ్లను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. తాము 50 ఏండ్లుగా ఇక్కడే ఉంటూ కాయకష్టం చేసి ఇండ్లు నిర్మించుకున్నామని మాజీ ఎమ్మెల్యేలతో వాపోయారు. తెల్లవారకముందే ఇండ్లపైకి జేసీబీలు తెచ్చి దౌర్జన్యంగా కూలగొట్టారని, కనీసం సామాన్లు కూడా తీయనీయలేదని విలపించారు. ఈ సందర్భంగా బాధితులను బాలరాజు, జైపాల్‌యాదవ్ ఓదార్చారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంతకుముందు బాధితులు ఆలయ చైర్మన్, అర్చకులు, మేనేజర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.