హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన డిక్లరేషన్లకే దిక్కులేదు.. ఇప్పుడు నల్లమల డిక్లరేషనా?’ అని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజు నిప్పులు చెరిగారు. నల్లమల బిడ్డనని గొప్పగా చెప్పుకొనే సీఎం రేవంత్రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో అదే ప్రాంతంలో ఉంటున్న చెంచులు, ఆదివాసీలకు చేసిందేమీలేదని మండిపడ్డారు. మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, నాయకుడు జాన్సన్ నాయక్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
మొన్న అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభా వేదికపై ఆదివాసీలకు సీఎం చోటివ్వలేదని విమర్శించారు. సభకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చి చెంచులను మాత్రం విస్మరించారని దుయ్యబట్టారు. సమస్యలు చెప్పుకొందామని వచ్చిన వారిని ఠాణాల్లో నిర్బంధించి ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప సీఎం రేవంత్రెడ్డి ఆచరణలో చేసేది శూన్యమని ఎద్దేవాచేశారు.
కేసీఆర్ పాలనలోనే చెంచులు, ఆదివాసీలకు సముచిత గౌరవం దక్కిందని గుర్తుచేశారు. ఆరు లక్షల మందికి పోడు పట్టాలు ఇవ్వడమేగాకుండా రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపజేశారని, సాగు కోసం పంప్సెట్లు అందజేశారని చెప్పారు. నాడు ఎన్నికల కోడ్ కారణంగా 26 మందికి పోడు పట్టాలివ్వలేకపోయామని, నేడు రేవంత్రెడ్డి పట్టాలిచ్చి తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను పచ్చగా మార్చేందుకు పాలమూరు ఎత్తిపోతలతోపాటు పలు రిజర్వాయర్లు నిర్మించారని చెప్పారు. అచ్చంపేటలో ఉమామహేశ్వర, చెన్నకేశవ రిజర్వాయర్ల నిర్మాణానికి సంకల్పించారని గుర్తుచేశారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు కోసం రూ. 23,500 కోట్ల నిధులు కేటాయించి రూ. 16,500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కాంగ్రెస్ గద్దెనెక్కి 18 నెలలు దాటినా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. నీళ్లివ్వడం మరిచిన ముఖ్యమంత్రి రేవంత్ సోలార్ పంప్సెట్లు ఇస్తే ఏం లాభమని నిలదీశారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి ఆలయమే ఇప్పుడు రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న అందాలపోటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాయని బాలరాజు చురకలంటించారు. ‘కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన డిక్లరేషన్లన్నీ అటకెక్కాయి. ఇప్పుడు ఈ సర్కారు పని అయిపోయిందని ప్రజలే డిక్లేర్ చేస్తున్నరు’ అని దెప్పిపొడిచారు. నల్లమలలో యురేనియం వెలికితీతను అడ్డుకున్నది బీఆర్ఎస్ సర్కారేనని స్పష్టంచేశారు. గత యూపీఏ ప్రభుత్వం ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీకి ఇక్కడి ఖనిజాలను దోచిపెట్టేందుకు కుట్ర చేసిందని విమర్శించారు. ‘ఇప్పుడు రేవంత్ కన్ను ఆ సంపదపై పడ్డట్టున్నది. అందుకే పదేపదే ఇక్కడికి వచ్చి ఏదో ఉద్దరిస్తున్నానని చెప్పుకొంటున్నరు. గువ్వల బాలరాజు బతికినంత వరకు.. బీఆర్ఎస్ ఉన్నంతవరకు నల్లమల సంపదను తాకట్టు పెట్టనిచ్చేది లేదు’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత గిరిజన, ఆదివాసీల బతుకులు ఆగమయ్యాయని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనులను ఆదుకుంటాం.. ఆదివాసీలను ఉద్ధరిస్తామని రేవంత్ చెప్తున్న మాటలు వింటుంటే ద య్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. నాడు శాంతియుతంగా ఎక్కడా గొడవలు కాకుండా రెండు, మూడు ఎకరాల చొప్పు న పోడు పట్టాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. గిరి గూడేలకు భగీరథ కింద మంచినీళ్లు అందించిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. రేవంత్ మాత్రం ఎకరం ఇచ్చి ఫోజులు కొడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేమీలేదని ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్నాయక్ విమర్శించారు. వారి ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు ఇక్కట్ల పాల్జేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆ పార్టీ నుంచి అనేక మంది గిరిజన బిడ్డలు ఎమ్మెల్యేలుగా గెలిచారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం గిరిజన మంత్రిత్వ శాఖను ఆయన వద్దే పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హామీల ఊసెత్తకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ రోజులు గడుపుతున్నారని ఎద్దేవాచేశారు.
అచ్చంపేట సభ సాక్షిగా ఆదివాసీలు, గిరిజనులపై ప్రేమ ఒలకబోసిన సీఎం రేవంత్రెడ్డి.. వారిపై నిజంగా అంత ప్రేమ ఉంటే గిరిజన మంత్రిత్వ శాఖ ఎందుకివ్వలేని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రశ్నించారు. 1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీ బిడ్డలను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తూర్పారబట్టారు. గిరిజన, ఆదివాసీలకు ఏదైనా మేలు జరిగిందంటే అది కేసీఆర్ పాలనలోనేని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ఇప్పటికైనా అబద్ధాలు మానుకొని పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.