హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో అన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని చేసినా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని స్పష్టంచేశారు. మిగతా పార్టీల్లో తాము సీఎం అభ్యర్థులమని చెప్పుకొని తిరిగేవారికి, తమనే సీఎం చేస్తారని ఆశించేవారికి తెలంగాణపై సీఎం కేసీఆర్‌కు ఉన్నంత అవగాహనే లేదని చెప్పారు. శుక్రవారం మండలిలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై ప్రజలకున్న విశ్వాసాన్ని ఏ పార్టీ చెరిపివేయలేదన్నారు. దేశానికి, రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందే మీ లేదని విమర్శించారు. మాడల్ స్కూళ్లను, బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్‌ఫండ్ (బీఆర్జీఎఫ్)ను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. 9 రాష్ర్టాల్లో ప్రజాతీర్పునకు భిన్నంగా బీజేపీ వ్యవహరించి ప్రజాప్రభుత్వాలను కూల్చిందని ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో తానెక్కడా పోటీచేయనని, తన కుమారుడు అమిత్‌రెడ్డికి అవకాశం లభిస్తే పోటీచేస్తారని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ బాగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో 12 సీట్లూ బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరతారన్న ప్రచారం మీడియా ద్వారా తెలిసిందని చెప్పారు. వేముల వీరేశం కాంగ్రెస్‌లోకి వెళ్తారనేది వాస్తవం కాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరుతాం అని చెప్పుకొనే నేత లు తమను తాము ఎక్కువ ఊహించుకొంటున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఖమ్మం, మహబూబ్‌నగర్ నేతలు తాము గొప్పవాళ్లమని చెప్పుకొంటున్నారని, అయితే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వారి బలం ఎంతో తెలుస్తుందని అన్నారు. కలలు కనాలే కానీ పగటి కలలు కనకూడదని చురకలంటించారు.
‘తెలంగాణ ప్రతి అంగుళాన్ని స్పర్శించిన వ్యక్తి కేసీఆర్.. కేసీఆర్ కన్నా గొప్పగా ఈ గడ్డను ప్రేమించేవాళ్లున్నారా?’ అని గుత్తా ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదని, వారికి ఉన్నది కేవలం అధికారం మీద ప్రేమ అని విమర్శించారు. ఆ రెండు జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారికి కేసీఆర్‌కు ఏమైనా పోలిక ఉన్నదా? అని నిలదీశారు. రాష్ట్రం కోసం ఉద్యమించి, తెలంగాణను సాధించిన తరువాత అతి తక్కువకాలంలోనే దేశంలో అగ్రభాగాన నిలిపిన దార్శనికుడు కేసీఆర్ అని కీర్తించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారని స్పష్టంచేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా రేవంత్‌రెడ్డి తన ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం రేవంత్ ఏమి చేయలేదని అన్నారు. రేవంత్ మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు తమ పదవులకు ఫార్మాట్లో రాజీనామా చేసి స్పీకర్‌కు సమర్పిస్తే, రేవంత్ తన రాజీనామాను చంద్రబాబుకు, అదీ ఆంధ్రాప్రాంతానికి వెళ్లి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.