రామగిరి, ఏప్రిల్ 6: ‘తెలంగాణ వచ్చాకే రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా ఓ వైపు ప్రజలను చైతన్యం చేసేలా వార్తలను ప్రచురించడం.. మరోవైపు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ కంపెనీల కార్లు, టూ వీలర్ వాహనాలతో నమస్తేతెలంగాణ మెగా ఆటో షో నిర్వహించడం అభినందనీయం’ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ‘నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శనివారం మెగా ఆటో షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుత్తా ముఖ్యఅతిథిగా హాజరై.. నమస్తేతెలంగాణ అడ్వైర్టెజ్‌మెంట్ జనరల్ మేనేజర్ నెమరుగొమ్ముల సురేందర్‌రావు, ఏజీఎం రాజిరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆటో షోను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లగొండలో ఇంత పెద్ద స్థాయిలో మెగా ఆటో షోను నిర్వహించడం హర్షణీయమని చెప్పారు.
బెంజ్, వోల్వో వంటి పెద్ద పెద్ద కంపెనీల వాహనాలను ఇక్కడికి రప్పించి ప్రదర్శించడం చాలా బాగుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి కొనుగోలు శక్తి పెరిగి లగ్జరీ కార్లు వినియోగిస్తున్నారని చెప్పారు. కమర్షియల్ రంగంతోపాటు వ్యవసాయ రంగంలోనూ అవసరాలకు అనుగుణంగా అనేక కొత్త మాడల్స్ అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. ఈ అవకాశాన్ని నల్లగొండ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కంపెనీల స్టాల్స్ వద్దకు వెళ్లి వాటి ఫీచర్స్, ధరలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తాను చదువుకునే రోజుల్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ నడిపానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నూతన మాడల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ట్రాక్టర్‌ను నడిపారు. యాక్టివా తీసుకున్న పజ్జూరు రైతు జే వెంకన్నకు తాళం చెవిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో నమస్తేతెలంగాణ బ్రాంచి మేనేజర్ టీ మహేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్‌రెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్, ఏడీవీటీ మేనేజర్లు కైరంకొండ శివకుమార్, శ్రీచరణ్ ఆనంద్, సర్క్యులేషన్ మేనేజర్ మల్సూర్‌గౌడ్, నమస్తేతెలంగాణ వివిధ భాగాల ఇన్చార్జీలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా ఆటో షోలు నిర్వహిస్తున్నాం. నల్లగొండలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తొలిసారి నల్లగొండ జిల్లాలో బెంజ్, వోల్వో కార్లను అందుబాటులోకి తెచ్చి కొనే అవకాశం కల్పించింది మేమే. ఒకే వేదికపై వివిధ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తెచ్చి కొనుగోలుదారులకు సమయం ఆదాతోపాటు డిస్కౌంట్, బ్యాంకర్స్‌తో ఇక్కడే రుణ సదుపాయం కల్పించాం. ఈ ఆటో షోకు నల్లగొండలోని పవన్ మోటార్స్ వారు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించారు.
– నెమరుగొమ్ముల సురేందర్‌రావు, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్‌మెంట్ జనరల్ మేనేజర్