నల్లగొండ ప్రతినిధి, జూలై 21(నమస్తే తెలంగాణ): బనకచర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బనకచర్ల వల్ల రాష్ర్టానికి అదనంగా వచ్చే నీరు ఏమీ ఉండదని పేర్కొన్నారు. సోమవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న ఫిర్యాదులను ప్రస్తావించారు. వీరిద్దరి మధ్య గొడవ సభ బయట జరిగిందని పేర్కొన్నారు. సభ లోపల జరిగితే వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
సభ బయట జరిగిన అంశంపై వచ్చిన ఫిర్యాదులపై చట్టపరంగా ఎలా వ్యవహరించాలనేది పరిశీలనలో ఉన్నదని తెలిపారు. సభ్యులు హూందాగా ప్రవర్తించాలని, దానికి భిన్నంగా సభ్యులు ప్రవర్తించడం వ్యక్తిగతంగా తనను బాధించిందని అన్నారు. బాధ్యతల్లో ఉన్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక ఎన్నికల ఖర్చుపైనా నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. దీనివల్లే విచ్చలవిడి అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు.
ఎన్నికల కోసం పార్టీలు వేల కోట్ల రూపాయలు, పోటీ చేసే అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు చేస్తుండటం వల్ల రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. ఎన్నికల ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని సూచించారు. కొందరు నేతల నుంచి స్ఫూర్తి పొంది కొందరు అధికారులు సైతం అవినీతికి పాల్పడుతూ వందల కోట్ల ఆస్తులు వెనకేస్తున్నారని ఆరోపించారు. ఉచిత పథకాలపైనా నియంత్రణ అవసరమని చెప్పారు.
ఉచిత పథకాలతో రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు దివాలా తీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలుపు కోసమే పోటీ పడి.. ఉచిత పథకాలు ప్రకటించడం సరికాదని సూచించారు. పనులు మానేసి ఉచిత పథకాల వైపు ప్రజలు ఎదురుచూసే పరిస్థితులు నెలకొంటుండటం మంచిదికి కాదని అన్నారు. ఇలాంటి వాటిపై అన్ని పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని, ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.