నల్లగొండ: మదర్ డెయిరీ ఆస్తుల అమ్మకం మంచి నిర్ణయం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అప్పులు, నష్టాల నుంచి బయటపడాలంటే ఆస్తుల అమ్మకమే పరిష్కారం కాదని సూచించారు. నిర్వహణ, ఓవర్ హెడ్ ఖర్చు తగ్గించుకోవాలన్నారు. కోఆపరేటివ్ వ్యవస్థలో ప్రతిఒక్కరు నిజాయితీగా పనిచేయాలన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థకు నష్టాలు వస్తుంటే 250 మందిని పర్మినెంట్ చేశారని విమర్శించారు. ఇది అదనపు ఖర్చని, ఇలాంటివి తగ్గించుకుని సంస్థను కాపాడాలన్నారు. రైతులను కాపాడాలని చెప్పారు. అమ్ముకుంటూ పోతే ఏదోఒక రోజు మదర్ డైరీని కూడా అమ్మే పరిస్థితి వస్తుందన్నారు.
ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం, డెయిరీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. తాను 8 సంవత్సరాలు డెయిరీ చైర్మన్గా పనిచేశానని, ఫెడరేషన్ నుంచి నార్ముల్గా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. సంస్థను రూ.5 కోట్ల నష్టాల నుంచి లాభాల బాట పట్టించామన్నారు. కాగా, కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కులగణన జరిగిందన్నారు. 50 రోజుల్లోనే 97 శాతం ప్రజలు కులగణనలో వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే ఓటర్ జనాభాకి, సర్వే లెక్కలుకు పొంతన కుదరలేదని వెల్లడించారు. ఒక్కొక్కరు రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఏ పథకం అమలుచేసినా లేకున్నా తప్పనిసరిగా రైతు భరోసా అందజేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో పంటల అధిక ఉత్పత్తికి రైతు భరోసా కూడా కారణమన్నారు. కులాల పేరుతో ఏ సభ్యుడు వ్యాఖ్యలు చేసినా అది అనైతికమని చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడించారు.