తిర్యాణి, ఆగస్టు 26 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడిమాధర ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న విద్యార్థి ఆత్రం అనురాగ్ (11) డెంగీ జ్వరం తో మృతి చెందాడు. ఆత్రం అనురాగ్‌కు ఈనెల 15న తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మం డల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు నాలుగు రోజులపాటు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 19న మంచిర్యాలలోని ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ దవాఖానకు తరలించగా, బాలుడికి డెంగీ జ్వరం వచ్చిందని నిర్ధారించారు. అనురాగ్ తల్లిదండ్రులు అదే రో జు తమ బంధువుల ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు.
విష యం తెలుసుకున్న తిర్యాణి ఆర్బీఎస్కే వైద్యాధికారి ఈనెల 20న మాతా శిశుసంక్షేమ దవాఖానలో చేర్పించి చికిత్స అందించారు. ఆపై వరంగల్ పట్టణంలోని ఎంజీఎం దవాఖానకు తరలించగా, సోమవారం రాత్రి మృతి చెందాడు. తిర్యాణి దవాఖాన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన కొడుకు చనిపోయాడని అనురాగ్ తండ్రి ఆత్రం సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డీడీవో రమాదేవి, ఆర్డీవో లోకేశ్వరావు, ఎంపీడీవో వేముల మల్లేశ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడు సాగర్‌ను సస్పెండ్ చేస్తూ.. ఏఎన్ఎం సువార్తను విధులనుంచి తొలగిస్తూ ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారు.