హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లోనూ 010 పద్దు ద్వారానే వేతనాలు చెల్లించాలని ఆయా గురుకులాల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఉ ద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తుండగా, సొసైటీల్లో మాత్రం ఒక నియమిత తేదీ అంటూ లేకుండా పోయింది. ఒక్కో సొసైటీలో ఒక్కో తేదీన వేతనాలు చెల్లిస్తున్న దుస్థితి నెలకొన్నది.
తమకు సైతం 010పద్దు ద్వారా ప్రభుత్వమే ప్రతి నెలా 1న వేతనాలు చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. సర్కార్ మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టిందిలేదు. తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) రద్దుచేసి, సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సైతం నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.