హైదరాబాద్, ఆగస్టు29 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ నల్లబ్యాడ్జీలను ధరించి సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ నిరసన తెలియజేయాలని గురుకుల విద్యా జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లో నిరసన చేపట్టాలని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈజేఏసీ) ఇచ్చిన పిలుపునకు సంఘీభావంగా ప్రభుత్వ గురుకులాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1, 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు వచ్చే నెల 2,3న తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్టు ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణప్రదీప్ ప్రకటనలో తెలిపారు. చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభలో నిర్వహించే తరగతులకు ప్రొఫెసర్లు హరగోపాల్, ఘంటా చక్రపాణి, అడపా సత్యనారాయణ హాజరవుతారని తెలిపారు. వివరాలకు 9133517733 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
హైరదాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపునకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్(లిప్) కార్యక్రమాల కోసం నియమించిన మండల నోడల్ అధికారులు వారంలో రెండు రోజులు స్కూళ్లను పర్యవేక్షించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సూచించారు. కనీసం 4 -5 పాఠశాలలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎఫ్ఎల్ఎన్, లిప్ ప్రోగ్రామ్స్‌పై బుధ, గురువారాల్లో జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల్లో మండలంలోని అన్ని పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు.