హైదరాబాద్, జూలై5 (నమస్తే తెలంగాణ): అన్ని గురుకులాల్లో ఒకే విధమైన పనివేళలను ప్రవేశపెడుతూ జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రొగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసొసియేషన్ (పీఆర్‌జీటీఏ) అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. కామన్ టైంటేబుల్ అమలుతో ఎలాంటి ప్రయోజనమూ చేకూరబోదని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ ఓఎస్డీ విద్యాసాగర్, మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తప్సీర్ ఇక్పాల్అహ్మద్ను శుక్రవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
కామన్ టైంటేబుల్లో ఎలాంటి శాస్త్రీయత లేదని, దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారని వెల్లడించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పీఆర్‌జీటీఏ ప్రతిపాదించిన టైం టేబుల్‌ను అమలు పరుచాలని, లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ వేణుప్రసాద్, జాయింట్ సెక్రటరీలు ఉప్పు అశోక్, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, డాక్టర్ నిర్మలానందం, టెమ్రీస్ విభాగం అధ్యక్షుడు పానుగంటి విజయ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ చెలాని సంజీవరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షుడు గుర్రం రమేశ్, రంగారెడ్డి అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీలు ఏసురత్నం, నరేశ్ పాల్గొన్నారు.