గంగాధర, ఏప్రిల్ 5: కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి పిల్లలను టెన్త్ విద్యార్థులు చితకబాదిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. తమకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదన్న కారణంగా శుక్రవారం రాత్రి 35 మంది 9వ తరగతి విద్యార్థులను 20 మంది టెన్త్ స్టూడెంట్లు చితకబాదిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విధులు నిర్వహించిన గెస్ట్ టీచర్ రమేశ్, నైట్ వాచ్మెన్ శంకర్ పట్టించుకోకపోవడంతో దెబ్బలకు తాళలేక పలువురు విద్యార్థులు గోడ దూకి పకనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తి విషయం చెప్పారు. పోలీసులు స్కూల్‌కు రాగా, అప్పటికే గొడవ సద్దుమణిగింది.
ఉదయం స్కూల్‌కు వచ్చిన ప్రిన్సిపాల్ జైసింగ్, టీచర్లకు జరిగిన ఘటనను విద్యార్థులు వివరించినా వారు పట్టించుకోలేదు. విషయం తెలిసి వచ్చిన తల్లిదండ్రులను లోపలికి రాకుండా స్కూల్ గేటుకు తాళం వేసి బయటే ఆపివేయడంతో వారు ఆందోళన చేసిన విషయం విదితమే. అదేరోజు తహసీల్దార్ రజిత, ఎంపీడీవో దమ్మని రాము, ఎంఈవో ప్రభాకర్‌రావు, ఎస్సై వంశీకృష్ణ, ఆర్సీవో అంజలి ఘటనపై విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ క్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ జైసింగ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, గెస్ట్ టీచర్ రమేశ్, నైట్ వాచ్‌మన్ శంకర్‌ను విధుల నుంచి తొలగిస్తూ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు ఉత్తర్వులు జారీ చేశారు.