హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గురుకులాల విద్యార్థులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఇటీవల జారీచేసిన పనివేళలను మార్చాలని గురుకుల విద్యాజేఏసీ డిమాండ్ చేసింది. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు రెండో రోజూ కొనసాగాయి. అన్ని గురుకులాల్లో బోధన, బోధనేతర ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి బుధవారం విధులకు హాజరయ్యారు. సమస్యలను ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని జేఏసీ నేతలు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తక్ష ణం స్పందించాలని, అశాస్త్రీయంగా రూపొందించిన పనివేళలను సవరించాలని, అందరికీ 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని, విద్యార్థుల డైట్ చార్జీలు పెంచాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలని, కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి, బేసిక్ పే వర్తింపజేయాలని, అన్ని గురుకుల సొసైటీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఏకరూప నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో గురుకుల విద్యాజేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సీహెచ్ బాలరాజు, యాదయ్య, రుషికేశ్కుమార్, ప్రభుదాస్, చలపతి, బాలస్వామి, గోవర్ధన్‌రెడ్డి, ఝాన్సీరాణి, సాంబలక్ష్మి, ఆవుల సైదులు, జానీమియా, శ్రీనివాస్, గురుకులాల బోధన, బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు. అటు.. నిరసనల్లో భాగంగా గురువారం సంతకాల సేకరణ చేపట్టి ప్రిన్సిపాల్స్ ద్వారా సొసైటీల కార్యదర్శులకు తమ డిమాండ్లను పంపించాలని సిబ్బందికి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.