TREIRB | హైదరాబాద్, జూన్6 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటివరకు తేల్చిచెప్పిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇప్పుడు అందుకు భిన్నంగా ముందుకుసాగుతున్నదని గురుకుల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరించకపోయినా ట్రిబ్ నియామక ప్రక్రియను పునఃప్రారంభించిందని మండిపడుతున్నారు. మైనార్టీ గురుకుల సొసైటీలో పీడీ, లైబ్రేరియన్ పోస్టుల భర్తీని చేపట్టడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
9,210 గురుకుల పోస్టులకు ట్రిబ్ నియామక ప్రక్రియను చేపట్టింది. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి ఎంపికైన మెరిట్ అభ్యర్థులను ప్రకటించడంతోపాటు, సొసైటీల వారీగా అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా ఇచ్చింది. ఆయా సొసైటీలు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి పోస్టింగ్‌ను ఇవ్వాల్సి ఉన్నది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సొసైటీలు ఆ ప్రక్రియను ఇప్పటివరకు చేపట్టలేదు.
తాజాగా మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం పీడీ, లైబ్రేరియన్ అభ్యర్థులకు పోస్టింగ్‌ను ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు నిర్దేశిత సర్టిఫికెట్లతో నాంపల్లిలోని అనిసుల్గుర్బాలో ఉన్న సొసైటీ కార్యాలయానికి 11,12 తేదీల్లో రావాలని పోస్ట్ ద్వారా కాల్‌లెటర్లను కార్యాలయ సొసైటీ కార్యదర్శి, ట్రిబ్ చైర్మన్ అయేషా మస్రత్ ఖానం పంపించారు. ఇప్పుడిదే వివాదానికి తావిస్తున్నది.
గురుకుల అభ్యర్థుల ఆగ్రహం
ట్రిబ్ చైర్మన్, మైనార్టీ గురుకుల సొసైటీ వ్యవహారంపై గురుకుల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. గురుకుల పోస్టుల భర్తీకి రిలింక్విష్మెంట్, వెయింటింగ్ జాబితా విధానాన్ని అమలు చేయాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అందుకు అనుగుణంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మైనార్టీ సొసైటీ మాత్రం ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియను చేపట్టింది.
దీనిపై అభ్యర్థులు మండిపడుతున్నారు. కామన్ పేపర్‌ను పెట్టి, అవరోహణ క్రమంలో పోస్టుల భర్తీ చేపట్టకుండా, ఆరోహణ పద్ధతిలో రిలిక్విష్మెంట్ లేకుండా ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడే అవకాశముందని ఆది నుంచీ వాదిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకముందే మైనార్టీ సొసైటీలో పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా పోస్టింగ్స్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.