సంగారెడ్డి/ హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): కల్హేర్/సిర్గాపూర్, మార్చి 29: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లికి చెందిన దార నిఖిల్‌కుమార్ (14) సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా డు. వారంరోజులుగా అనారోగ్యానికి గురై భోజనం చేయక ఆరోగ్యం దెబ్బతినడంతో 26న పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే విద్యార్థి కుటుంబీకులు హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తమ కుమారుడి మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థి మృతదేహంతో గురుకుల పాఠశాల ముట్టడికి యత్నించారు. నారాయణఖేడ్ ఆర్డీవో అశోక చక్రవర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఆర్సీవో నిర్మలతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే విద్యార్థి అంత్యక్రియల కోసం రూ.50 వేలు అందజేసి, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ధర్నా వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు.
సర్కారు నిర్లక్ష్యానికి నిఖిల్ బలి
సర్కారు నిర్లక్ష్యానికి విద్యార్థి నిఖిల్ బలైపోయారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘విద్యార్థి మరణం బాధాకరం.. చిన్న జ్వరానికే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం శోచనీయం’ అంటూ శనివారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. 83 మంది గురుకుల విద్యార్థులు మరణించినా దిద్దుబాటు చర్యలు చేపట్టని ప్రభుత్వ అసమర్థతకు ఈ ఘటనే ఉదాహరణ అన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను రక్షించాలని, నిఖిల్ కుటుంబానికి రూ. 15 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.