మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 24 : మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్-నాగమ్మ దంపతుల రెండోకూతురు లక్ష్మీప్రసన్న(19) బీకాం సెకండియర్ చదువుతున్నది. బుధవారం రాత్రి 9:30 గంటలకు తన చిన్నమ్మ కొడుకు కోలపూరి వెంకటేశ్‌కు వాచ్‌మన్ మహేశ్ ఫోన్ నుంచి మిస్డ్‌కాల్ ఇవ్వగా.. ఈ సమయంలో విద్యార్థులకు మొబైల్స్ ఎందుకు ఇస్తున్నారంటూ వెంకటేశ్ వాచ్మన్ని నిలదీశాడు. దీనిపై ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ మల్లేశ్‌కు ఫోన్‌చేసి వాచ్‌మన్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో వాచ్‌మన్ లక్ష్మీప్రసన్నను దూషిండం తో మనస్తాపం చెంది గురువారం ఉదయం కళాశాల భవనం నాలుగో అంతస్తు ఎక్కి కిందకు దూకింది. విద్యార్థులు, అధ్యాపకులు ఆమెను మంచిర్యాల జనరల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ చేరుకోగా.. మృతురాలి తల్లితండ్రులు ఆయన కాళ్లమీదపడ్డారు. కారకులకు శిక్షపడేలా చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కళాశాల ప్రిన్సిపాల్ అనూషను వివరణ కోరగా.. తాను లీవ్‌లో ఉన్నానని, లక్ష్మీప్రసన్న తన అన్నయ్యతో రాత్రి ఫోన్లో మాట్లాడినట్టు వాచ్‌మన్ తన దృష్టికి తీసుకువచ్చాడని వివరించారు. మృతురాలి తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు.