సీసీసీ నస్పూర్/చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్, జూలై 14: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాల వసతిగృహంలో ఓ విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గద్వాల జిల్లా మన్నెకల్ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన వీరాబాయి పరశురాం- జయమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు సంధ్య(10) తూప్రాన్‌పేట గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది. పూర్తిస్థాయి తరగతులు జరగకపోవడంతో ఇటీవల ఇంటికి వెళ్లింది. ఆమె తల్లి ఆదివారం హాస్టల్‌కు పంపించింది. సోమవారం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తోటి విద్యార్థులు బాలిక కనిపించడంలేదని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు.
పాఠశాల ఆవరణంలో వెతకడంతో రక్తపు మడుగులో సంధ్య మృతదేహం కనిపించింది. పాఠశాల అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అం దించగా ఆర్డీవో శేఖర్‌రెడ్డి, ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్ చేరుకుని వివరాలు సేకరించారు. హాస్టల్లో ఉండటం ఇష్టంలేక బలవన్మరణం చెందినట్టు ప్రాథమిక సమాచారం. కాగా సంధ్య ఆత్మహత్యకు పాఠశాల అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ప్రజాసంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి. మృ తురాలి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యో గం, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశాయి. గురుకుల పాఠశాల జాయింట్ సెక్రటరీ శ్యామ్‌లాల్ చేరుకుని విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఉపాధ్యాయులను తొలగిస్తామని, బాలిక కుటుంబసభ్యులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం సీసీసీ ప్రాంతంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయంలో తొ మ్మిదో తరగతి విద్యార్థిని మధులిఖిత ఆత్మహత్యకు యత్నించింది. మృతురాలి కుటుంబీకుల వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం వెల్గనూరుకు చెందిన నరేశ్-నాగజ్యోతి దంపతుల ఇద్దరు కూతుళ్లు నస్పూర్ కేజీబీవీలో చదువుకుంటున్నారు. ఇటీవల సెలవుల్లో ఇం టికి వచ్చిన మధులిఖితను ఆమె తల్లిదండ్రు లు సోమవారం కస్తూర్బాలో దింపివెళ్లారు. వారు వెళ్లిపోయిన కొద్దిసేపటికే ముధులిఖిత పాఠశాల భవనం పైనుంచి దూకగా రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన సిబ్బంది బాలికను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇటీవల మధులిఖితకు ఫుడ్‌పాయిజన్ కావడంతో దవాఖానలో చేర్పించామని, ఆరోగ్యం కుదుటపడడంతో 10రోజుల తర్వాత పాఠశాలకు తీసుకొచ్చినట్టు తల్లిదండ్రులు తెలిపారు. హాస్టల్లో వాష్‌రూమ్స్, ఫుడ్ సరిగాలేదని, అక్కడ చదువుకోలేనని చెప్పినప్పటికీ ఒప్పించి పాఠశాలకు తీసుకువచ్చినట్టు వారు వాపోయారు.