హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలు మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నరగా అద్దె చెల్లించకపోవడంతో భవనాలకు తాళాలు వేసేందుకు యజమానులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రిన్సిపాళ్లకు నోటీసులు జారీచేశారు. ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో భవనాల రుణాలకు సంబంధించిన ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా బకాయిలు చెల్లించకపోతే భవనాలకు తాళాలు వేస్తామని నోటీసులలో తేల్చిచెప్పారు.
భవనాలకు అద్దె చెల్లించాలని యజమానులు కొన్నినెలలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఈఎంఐలు కట్టకపోవడంతో బ్యాంకులు తమకు నోటీసులను జారీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భవనాలను కూడా నిర్వహించలేని దుస్థితి నెలకొందని ప్రభుత్వ పెద్దలకు పలుసార్లు వినతిపత్రాలు సమర్పించారు. మంత్రులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. నిరుడు అక్టోబర్లో బిల్డింగ్లకు తాళాలు కూడా వేశారు. దిగివచ్చిన ప్రభుత్వం 2నెలల బకాయిలను చెల్లించింది. మళ్లీ నాటి నుంచి ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదు. దీంతో భవన యాజమానులు మరోసారి పోరుబాట పట్టారు. భవనాలను ఖాళీ చేయాలంటూ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు నోటీసులను జారీ చేశారు. ఈ నెల 12వ తేదీలోగా బకాయిలను చెల్లించకుంటే భవనాలకు తాళాలు వేస్తామని తెలంగాణ గురుకుల విద్యాలయాల ప్రైవేటు భవన యాజమాన్య సంఘం నాయకులు అల్టిమేటం జారీ చేశారు.