హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కమ్మదనం గ్రామ పరిధిలోని గురుకుల డిగ్రీ కళాశాల (Gurukula Degree College) విద్యార్థినుల ఆందోళనపై ఎస్సీ గురుకుల సొసైటీ (SC Gurukula Society) ఉన్నతాధికారులు నోరు తెరవడంలేదు. ప్రిన్సిపాల్ శైలజ వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు రోడ్డెక్కినా స్పందించడంలేదు. సొసైటీలోని పెద్దల అండతోనే కొందరు ప్రిన్సిపాల్స్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన కార్యాలయంలో తిష్ట వేసిన అధికారులు క్షేత్రస్థాయిలో గురుకులాలను సందర్శించకపోవడం సమస్యలకు కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు, గురుకుల సొసైటీ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. సొసైటీకి సంబంధించిన డిగ్రీ కాలేజీల ఇన్చార్జి, జోనల్ ఆఫీసర్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రిన్సిపాల్ శైలజ గతంలో సూర్యాపేట జిల్లాలో పనిచేశారు. గురుకులంలోనే ఆమె మద్యం తాగుతున్నారని విద్యార్థినులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సొసైటీలోని ఇన్చార్జి, జోనల్ ఆఫీసర్ ఆమెపై కఠిన చర్యలు తీసుకోలేదు. సూర్యాపేట నుంచి షాద్‌నగర్‌కు బదిలీ చేసి, చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం పని చేస్తున్నచోట కూడా మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నది.
విద్యార్థినులు రోడ్డుమీదకు వచ్చిన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ స్పందించి, ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేశారు. ఓ లెక్చరర్‌కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇంత జరుగుతున్నా సొసైటీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం, ఇన్చార్జిలపై చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. డిప్యూటేషన్ల పేరిట సొసైటీ ప్రధాన కార్యాలయంలో తిష్టవేసిన కొందరు అధికారుల అలసత్వం వల్లే గురుకులాలు గాడి తప్పుతున్నాయని సొసైటీ ఉద్యోగులు చెప్తున్నారు.