జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో (Gurukula School) ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు. అయితే తీవ్ర కడుపునొప్పితో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మరో ఇద్దరిలో ఒకరికి మెట్పల్లి దవాఖానలో, మరొకరికి నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఆర్డీవో శ్రీనివాస్.. మెట్పల్లిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి మృతి వార్తను అతని తల్లదండ్రులకు చేరవేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
గత నెల 26న కూడా ఇదే పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. మెట్పల్లిలోని ఆరపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహేశ్, లావణ్య దంపతుల కుమారుడు గణాదిత్య.. పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిద్రపోయిన బాలుడు అర్థ్రరాత్రి తర్వాత వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ సమాచారం అందించగా వెంటనే వచ్చిన తండ్రి మహేశ్ ద్విచక్ర వాహనంపై ఆస్పతికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, స్కూల్లో విద్యార్థులు వరుసగా అనారోగ్యానికి గురవుతుండటంతో.. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.