Asifabad | కౌటాల, ఆగస్టు 10 : డెంగ్యూతో గురుకుల విద్యార్థిని శనివారం మృతి చెందింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన జాడి కిశోర్-సురేఖ దంపతుల పెద్ద కూతురు పూజ (16) ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. పాఠశాల సిబ్బంది పూజ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో 8వ తేదీన ఆమె తండ్రి కిశోర్ పాఠశాలకు వచ్చి ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు.
జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం మహారాష్ట్రలోని చంద్రపూర్లోగల ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. డెంగ్యూతో బాధపడుతుండటంతో మెరుగైన చికిత్స కోసం చంద్రపూర్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు.